పారదర్శకంగా టెండర్లు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా టెండర్లు

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

పార్వతీపురం రూరల్‌: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసరాలను అందించేందుకు జీసీసీ సరుకుల టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ముగిసింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థలకు అవసరమైన సరుకుల సరఫరా కోసం పార్వతీపురం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్‌లో పీఓ ఆర్‌. వైశాలి, తదితర అధికారులు ఈ టెండర్ల ప్రక్రియను శనివారం పకడ్బందీగా నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు అందే సరుకుల్లో నాణ్యతతో పాటు, సరఫరాలో సమయపాలనకు పెద్దపీట వేశారు. ఈ ప్రక్రియలో సరఫరాదారులు సమర్పించిన పత్రాలు, కోట్‌ చేసిన ధరలు, సరుకుల నాణ్యతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా బేరీజు వేశారు. పోటీ ధరలకు, నిర్దేశిత స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న బిడ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. సరుకుల సరఫరాలో నాణ్యతా లోపాలున్నా, జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదని ఎంపికై న సరఫరాదారులకు అధికారులు స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

సీతంపేట: మండలంలోని కిట్టాలపాడు జంక్షన్‌ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. తొత్తడి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై నిమ్మక పవన్‌, సునీత, అనూషా వస్తున్నారు. పత్తికగూడ మలుపు వద్దకు వచ్చేసరికి సీతంపేట నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆటోను తప్పించే క్రమంలో ఆటో అద్దం తగిలి కిందపడ్డారు. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు.

అట్రాసిటీ కేసు నమోదు

వంగర: మండల పరిధి కింజంగి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన ఉత్తరావెల్లి కిశోర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వి.ప్రసాద్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన ఆశా వర్కర్‌ వజ్రగడ రామలక్ష్మి తన ఇంటి ఆవరణలో పూలు ఏరుతుండగా.. నిందితుడు ఆమెను కులం పేరుతో దూషించి, కొట్టినట్లు ఫిర్యాదు అందిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌

కొత్తవలస: వివిధ దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్న మండల కేంద్రం కుమ్మరవీధికి చెందిన గంగవరపు కేశవను సీఐ టి.వి.విజయకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం స్థానిక కొత్తవలస రైల్వేస్టేషన్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..గతేడాది డిసెంబర్‌లో మంగళపాలెంలో గల శివాలయంలో.. ఈ ఏడాదిలో విశాఖపట్నం రోడ్డులో గల దుర్గాదేవి గుడిలోను.. అలాగే కుమ్మరి బంజిరీ కాలనీలో గల ఒక ఇంట్లో జరిగిన దొంగతనాల్లో కేశవ నిందితుడని చెప్పారు. అప్పటినుంచి ఆయన పరారీలో ఉండగా.. కొత్తవలస రైల్వేస్టేషన్‌ వద్ద అతడ్ని పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై జోగారావు పాల్గొన్నారు.

కలెక్టరు, జేసీలను వదిలేసి రిటైర్డ్‌ తహసీల్దార్‌పై చర్యలా?

విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని మహారాజుపేట సర్వే నంబరు 569లోని భూ కేటాయింపు వ్యవహారంలో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విమర్శించారు. ఇదే విషయమై ఆయన జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. భూ వర్గీకరణ మార్చే అధికారం తహసీల్దారుకు లేనప్పుడు..కలెక్టరు, జేసీ, ఆర్డీవోలను వదిలేసి రిటైర్డ్‌ తహసీల్దారు ప్రభాకరరావుకు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నగరపాలక సంస్థ రికార్డుల్లో ప్రైవేట్‌ ఎస్టేట్‌ అని, రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు చెరువు అని నమోదైన స్థలాన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏ విధంగా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2022లో నిర్మాణం మొదలైనప్పడు మౌనంగా ఉండి, 2025లో ఫిర్యాదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు. నాటి కలెక్టరు లేఖలు, అధికారుల ఇన్‌స్పెక్షన్‌ నివేదికలు వెంటనే బహిర్గతం చేయాలని పట్టుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement