● గంగమాంబపురంలో జెండాలు పాతిన బాధిత రైతులు
● కబ్జాదారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్
పార్వతీపురం రూరల్: పెత్తందారులు అన్యాక్రాంతం చేసిన గిరిజనుల అసైన్‌న్డ్ భూములను సీపీఎం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బాధితులు గురువారం తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రావికోన పంచాయతీ గంగమాంబపురం రెవెన్యూ పరిధిలోని ఆయా సాగు భూముల్లో జెండాలు పాతి తమ హక్కును చాటుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం, గిరిజన సంఘాల నేతలు కొల్లి గంగునాయుడు, ఎ.అశోక్, కె.రామస్వామి మాట్లాడుతూ..సర్వే నంబర్ 25/4లో గిరిజనుడు జీలకర్ర సోమందొరకు చెందిన 1.11 ఎకరాల డీ–పట్టా భూమిని పొరుగు గ్రామానికి చెందిన ఆగివేండ్ర పకీరునాయుడు ఆక్రమించారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతోనే పోరాటానికి దిగామన్నారు. వీటికి తోడు సర్వే నంబర్లు 50/10, 9/4, 20, 24, 25లలో సుమారు 15 ఎకరాల అసైన్డ్ భూములను సైతం పెత్తందార్లు ఆక్రమించారని తెలిపారు. కలెక్టర్ వెంటనే గంగమాంబపురంలో సమగ్ర భూసర్వే నిర్వహించి, గిరిజనులకు భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేయాలని, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు పి.రాము, వరాలు, ఈశ్వరరావు, బలరాం లక్ష్మణ్, మెల్లక రాము, బాషా, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


