న్యూస్‌రీల్
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
● సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీళ్లమోత●మంత్రి ఇలాకాలో తాగునీటి ఇబ్బందులు
సాలూరు రూరల్: మన్యం ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బిందెడు నీటికోసం సుదూర ప్రాంతాలకు పయనిస్తున్నారు. చలమ లు, చేతిపంపుల నీటితో దాహం తీర్చుకుంటున్నారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడు తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభు త్వం నిర్లక్ష్యం గిరిజన గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. ప్రస్తుతం చాలా గిరిజన గ్రామాల్లో తాగునీటి పరిస్థితి అధ్వానంగా ఉంది. బోరుబావులు మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా బాగుచేసేవారు లేరు. మరమ్మతులు చేసేందుకు నిధులు లేవని పంచాయతీ కార్యదర్శులు చేతులెతేస్తున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలో గిరిజనులు తాగునీటికి కటకటలాడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జల్‌జీవన్ మిషన్ పథకం ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో సాలూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తాగునీటికి అవస్థలు పడక తప్పడం లేదు. డెన్సరాయి గ్రామంలో రెండు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో పక్క గ్రామమైన రేవడి వలసకు వెళ్లి గ్రామంలో చిన్నాపెద్ద తేడా లేకుండా బిందెలతో నీళ్లు మోసుకుని అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
●కొట్టుపరువు పంచాయతీ బూర్జివలస గ్రామంలో నెలరోజులుగా తాగునీటి బోరు మరమ్మతులకు గురైనా ఇప్పటివరకు బాగుచేయలేదు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న చేతి బోరు వద్ద నీళ్లు తోడుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే సమయంలోనూ తాగునీరు కోసం సమయం కేటాయించాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలి
మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి అవస్థలు పడుతున్నారని అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకుడు మర్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. డెన్సరాయి, బూర్జివలస గ్రామాల్లో వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని దీనిపై కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు.


