గురువుల భవితవ్యంపై అనిశ్చితి | - | Sakshi
Sakshi News home page

గురువుల భవితవ్యంపై అనిశ్చితి

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

గురువుల భవితవ్యంపై అనిశ్చితి

సందిగ్ధంలో గురుకులాల అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ రెన్యువల్‌ ఉత్తర్వులు ఇవ్వని ప్రభుత్వం ఉద్యోగం ఉంటుందో.. లేదో.. స్పష్టత కరువు అమలుకు నోచని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హామీ

గుమ్మలక్ష్మీపురం:

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు రెన్యువల్‌ ఉత్తర్వులు జారీ కాకపోవడంతో ఆందోళన నెలకొంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై, తరగతులు కొనసాగుతున్నప్పటికీ.. ఉద్యోగ కొనసాగింపుపై స్పష్టత లేకపోవ డం వల్ల వందలాది మంది ఉపాధ్యాయులు అనిశ్చితిలో ఉన్నారు. వెంటనే రెన్యువల్‌ ఉత్తర్వులు జారీ చేసి, తమ సేవలకు భరోసా కల్పించాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగం ఉంటుందో..లేదో తెలియక మనోవేదనకు గురవుతున్నారు.

ఎన్నో ఏళ్లుగా సేవలు...

రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకుల పాఠశాలల్లో సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా అవుట్‌సోర్సింగ్‌ విధానంలో 1,659 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరి సర్వీసును, సేవను గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం.. 2025 మెగా డీఎస్సీలో నిబంధనలకు విరుద్ధంగా 1,143 గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులను కలిపి భర్తీ చేసింది. ఆ నియామకం వల్ల గిరిజన గురుకుల పాఠశాలల్లో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేసిన వారి స్థానంలో డీఎస్సీలో ఎంపికై న రెగ్యులర్‌ ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. తమను యథావిధిగా విధుల్లో కొనసాగించాలన్న డిమాండ్‌తో అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులంతా సుమారు 45 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పట్లో స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. 2025 డీఎస్సీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు. ‘డీఎస్సీలో గురుకుల పాఠశాలల్లో ఉద్యోగం పొందిన వారితోపాటు ప్రస్తుతం అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా విధుల్లోనే ఉంటారు.. ఎవర్నీ తీయబోమ’ని హామీనిచ్చి, సమ్మెను విరమింపజేయించారు. దీంతో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులతోపాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు కూడా ఆయా పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో విధులు నిర్వహించారు.

నేటికీ రాని ఉత్తర్వులు

2026–27 విద్యాసంవత్సరం ఈ నెల 12తో ప్రారంభమైంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యా యులు ఆయా పాఠశాలలకు విధుల నిమిత్తం వెళ్లగా.. అక్కడి ప్రిన్సిపాళ్లు ‘ఉన్నతాధికారుల నుంచి రెన్యువల్‌ ఉత్తర్వులు రాలేదు. మీకు పోస్టులు లేవు. విధుల్లోకి తీసుకోలేమ’ని చెప్పే యడంతో వీరంతా కంగుతిన్నారు. చాలీచాలని వేతనాలతో.. రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా రాత్రనక, పగలనక విధులు నిర్వహిస్తున్నారు. గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన తమ పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారిందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తమ ఉద్యోగం రెన్యువల్‌ ఉత్తర్వుల కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. సరైన స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు రెండు దశాబ్దాల నుంచి పని చేస్తున్న తాము.. ఒక్కసారిగా కుటుంబంతో పాటు రోడ్డున పడతామని వాపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement