సర్కారు అభాసుపాలు | - | Sakshi
Sakshi News home page

సర్కారు అభాసుపాలు

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

సర్కారు అభాసుపాలు

సక్రమంగా అందని పౌష్టికాహారం

పాలకోసం అంగన్‌వాడీ లబ్ధిదారుల ఎదురుచూపులు

అంగన్వాడీలకు చేరని ఇతర సరుకులు

పార్వతీపురం రూరల్‌/ రామభద్రపురం: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలే పునాది. వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉంటేనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా నిలబడతారు. మాతాశిశువులు పోషకాహార లోపం, రక్తహీనత బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పంపిణీ ప్రక్రియ గాడితప్పడంతో అసలు లక్ష్యం అందని ద్రాక్షలా మారుతోంది.

మాతాశిశువులకు తప్పని నిరీక్షణ

జిల్లా వ్యాప్తంగా 1,425 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటి పరిధిలో 4,226 మంది గర్భిణులు, నెలల వయసు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 39,647 మంది ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో లబ్ధిదారులు పౌష్టికాహారం కోసం ఎదురుచూస్తుంటే.. అధికారులు మాత్రం సరుకులు జిల్లాకు చేరుకున్నాయని, నేడో రేపో పంపిణీ చేస్తామంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సకాలంలో పంపిణీ జరగకపోవడంతో మాతాశిశువులకు నిరీక్షణ తప్పడం లేదు.

విజయనగరం జిల్లాలో..

జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో గర్భిణులు 7388 మంది, బాలింతలు 7492 మంది ఉన్నారు.అలాగే 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 20,127 మంది, 7 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 35,482 మంది, 6 నెలల లోపు చిన్నారులు 6913 మంది ఉన్నారు.అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం వారిలో చినారులకు అంగన్‌వాడీ కేంద్రాలలో వండి పెడుతున్న మధ్యాహ్న భోజనంతో పాటు ఒక్కొక్కరికీ నెలకు 2.50 లీటర్లు పాలు ఇవ్వాలి. అలాగే బాలింతలు,గర్భిణులకు ఒక్కొక్కరికీ నెలకు 5 లీటర్లు చొప్పున పాలు అందజేయాల్సి ఉంది.ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 2,15,768 లీటర్ల పాలు అవసరమని అంగన్‌వాడీ కేంద్రాల టీచర్ల నుంచి నివేదికలు తీసుకుని ఆయా శాఖాధికారులు ఇండెంట్‌ పెట్టినట్లు సమాచారం.అయితే ఆ పాలు ఈ నెల 5వ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావాల్సి ఉన్నా ఇప్పటికీ కేంద్రాలకు సరఫరా కాని పరిస్థితి ఉంది. దీంతో గర్భిణులు, బాలింతలు ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియక అంగన్‌వాడీ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు,బాలింతలకు రక్తహీనతకు గురికాకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందజేయడమంటే ఇదేనా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement