● ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం క్రైమ్: క్రీడలు జీవితంలో ఆనందం కలిగించి, ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు స్థానిక విజ్జి స్టేడియంలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బుధవారం వైద్యులకు క్రికెట్ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పోటీలను ఎస్పీ దామోదర్ ప్రారంభించి మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగం, ఇతర దైనందిన జీవితంలో కలిగిన మానసిక ఒత్తిడిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి, వృత్తిలో మరింత ఏకాగ్రత పెరగడంతో పాటు, వృత్తి నైపుణ్యం కూడా మెరుగవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కూడా క్రికెట్ ఆడి క్రీడాభిమానులను అలరించారు.
పిడుగుపాటుతో దుక్కి
పశువుల మృతి
వేపాడ: మండలంలోని కరకవలస గ్రామపంచాయతీ శివారు మారిక గిరిజన గ్రామంలో పిడుగుపాటుకు గురై రెండు దుక్కి పశువులు మృతిచెందాయి. బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో పడిన పిడుగుకు గ్రామానికి చెందిన పాతబోయిన పైడితల్లికి చెందిన రెండు పశువులు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు.
పిడుగుపాటుతో ఏడు ఆవులు..
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిఽధి పల్లపుదుంగాడ గ్రామంలో బుధవారం మద్యాహ్నం వర్షం కురుస్తున్న సమయంలో గిరిజన రైతులు జరత లచ్చన్న, కినబెరి రామన్న, పోరి అప్పన్న, జన్ని భీమన్నలకు చెందిన ఏడు ఆవులు పిడుగుపాటుకు చనిపోయాయి. దీంతో సుమారు మూడు లక్షల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించిందని, గిరిజన రైతులు వాపోయారు. బాధిత గిరిజన రైతుల్ని ఆదుకోవాలని గిరిజన సంఘం నేతలు కోరారు.
వత్తాడలో కింగ్‌కోబ్రా..!
● ఇంట్లో చొరబడి గంటల తరబడి తిష్ఠ
● అటవీశాఖ చొరవతో పట్టుకున్న స్నేక్‌క్యాచర్స్
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని వత్తాడ గ్రామంలో బుధవారం కింగ్ కోబ్రా(గిరినాగు) ఆందోళన సృష్టించింది. ఈమేరకు గ్రామానికి చెందిన ఆలుగు పొట్టిందొర బుధవారం ఉదయం నిద్రలేచిన కొద్దిసేపటికి శబ్దం వినిపించగా బీరువావైపు చూడడడంతో ఏ సమయంలో దూరిందోగానీ బీరువాపై భాగంలో కింగ్ కోబ్రా ముడుచుకుని (చుట్టుకుని) కనిపించింది. దీంతో భయాందోళన చెందిన పొట్టిందొర కుటుంబీకులతో పాటు బయటికి వచ్చి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో..పాముకు ఎటువంటి హాని చేయకుండా స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. స్పందించిన అటవీశాఖ అధికారులు వత్తాడ గ్రామానికి వెళ్లి కింగ్‌కోబ్రాగా గుర్తించి..స్నేక్‌క్యాచర్స్‌కు సమాచారం అందించారు. విశాఖపట్నం నుంచి వత్తాడ గ్రామానికి మధ్యాహ్నం చేరుకున్న స్నేక్ క్యాచర్స్ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంతలో కింగ్‌కోబ్రా తన నోట్లోంచి మరో చచ్చిన పాము (జెర్రిపాము)ను బయటకు కక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కింగ్ కోబ్రా మరోపామును అమాంతం మింగడం వల్లనే ఎవరికీ హాని చేయకుండా బీరువాపై తనంతటతాను చుట్టుకుని ఉండిపోయిందని, లేకుంటే పెనుప్రమాదమే జరిగుండేదంటూ స్థానికులంతా వాపోయారు. కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్‌క్యాచర్స్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


