మోటార్‌ వైర్లు దొంగలిస్తున్న నిందితుడికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ వైర్లు దొంగలిస్తున్న నిందితుడికి రిమాండ్‌

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

గుర్ల: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వినియోగిస్తున్న విద్యుత్‌ మోటార్లు, సోలార్‌ మోటార్లకు సంబంధించిన వైర్లు ఎప్పటికప్పుడు దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిని గుర్ల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మోటార్‌ వైర్లు దొంగిలిస్తున్న మండలంలోని పల్లిగండ్రేడుకు చెందిన గొల్లపల్లి గోవింద్‌ను పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు సీఐ జి.శంకరరావు, ఎస్సై పి.నారాయణ రావు బుధవారం తెలిపారు. కోటగండ్రేడు సమీపంలోని రైతులు మోటారు వైర్లు దొంగిలిస్తుండగా నిందితుడిని పట్టుకుని అరెస్ట్‌ చేశామన్నారు. నిందితుడు గోవింద్‌ను విచారణ చేయగా గతంలో చేసిన మోటార్‌ వైర్ల దొంగతనం గురించి చెప్పినట్లు తెలిపారు. అరెస్ట్‌ చేసిన వ్యక్తిని చీపురుపల్లి కోర్టులో హజరుపరచగా నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు చెప్పారు.

హాస్టల్స్‌ సమస్యలు పరిష్కరించాలి

కలెక్టరేట్‌ ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళన

పార్వతీపురం రూరల్‌: ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్‌ మాట్లాడారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. జైళ్లలో ఖైదీల ఆహారానికి రోజుకు రూ.100కు పైగా ఖర్చు చేస్తుండగా, విద్యార్థులకు రోజుకు కేవలం రూ.53 మాత్రమే కేటాయిస్తున్నారన్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నెలకు రూ.1200, ఇంటర్‌ విద్యార్థులకు రూ.1600 మాత్రమే ఇవ్వడం సరిపోదన్నారు. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పాత భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న మెస్‌, కాస్మోటిక్‌ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మెస్‌ చార్జీలను రూ.2500 నుంచి రూ.3000కు పెంచాలని డిమాండ్‌ చేశారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్‌, కుక్‌, అటెండర్‌, కమాటి, ట్యూటర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement