సంతకవిటి: తమ కుటుంబంపై దొంగ ముద్ర పడడంతో అవమాన భారం తట్టుకోలేక ఓ తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సంతకవిటి మండలంలో జరిగిన ఈ సంఘటనపై రాజాం రూరల్ సీఐ హెచ్ ఉపేంద్రరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామారాయపురం గ్రామంలో గత నెల 25న ఓ ఇంటిలో నాలుగు తులాల బంగారం, పదివేల రూపాయలు చోరీ జరిగింది. ఈ చోరీ విషయంలో గ్రామానికి చెందిన వై.కళావతి(55), కుమారుడు చిరంజీవిలపై చోరీ జరిగిన ఇంటి బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఇరు కుటుంబాలు గొడవపడ్డాయి. మంగళవారం ఉదయం చోరీ జరిగిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా కళావతితో పాటు కుమారుడిని ఎస్సై స్టేషన్‌కు రమ్మన్నారు. వారు వచ్చిన సమయానికి స్టేషన్‌లో ఎస్సై లేకపోవడంతో తల్లీకొడుకులను వెళ్లిపోమని సిబ్బంది చెప్పడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. గ్రామస్తులు, బంధువులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటిముఖం పట్టిన తల్లీకొడుకులు గ్రామస్తులకు ఫోన్ చేసి తమపై దొంగ ముద్ర పడిందని, తమను పోలీసులు స్టేషన్‌కు పిలుస్తున్నారని తాము గడ్డి మందుతాగి చనిపోతామని బంధువులు, స్నేహితులు, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి, ఫోన్ స్విచాఫ్ చేశారు. అనంతరం గ్రామస్తులు వెతుకుతున్న క్రమంలో తన తల్లి ట్రైన్ కింద పడి మృతిచెందిందని ఆమె కుమారుడు చిరంజీవి గ్రామస్తులకు సమాచారం అందించాడు.
అవమానం భారం తట్టుకోలేకనే..
తమపై దొంగ ముద్ర పడడంతో పాటు, పోలీసులు పిలవడంతో అవమాన భారం తట్టుకోలేక మనస్తాపంతో తన తల్లి రైలు కింద పడి మరణించినట్లు కుమారుడు చిరంజీవి వెల్లడించినట్లు సీఐ తెలిపారు. తామిద్దరం పొందూరు మండలం పెనుబర్తి గ్రామం వద్ద ఈనెల 16న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుని ట్రైన్‌కు ఎదురుగా నిల్చున్నామని, ఇంతలో తన తల్లి తనను పట్టాలపైనుంచి పక్కకు తోసేసి, తాను ఆత్మహత్య చేసుకుందని కుమారుడు తెలిపినట్లు సీఐ వివరించారు. ఇదిలా ఉండగా కళావతి ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


