వంగర: మండల పరిధి ఓనె అగ్రహారం గ్రామంలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన పెడన ఈశ్వరమ్మ పాముకాటుకు గురైంది. ఈ మేరకు మంగళవారం స్థానిక బందకాలువ గట్టుపై పనులు చేస్తుండగా రక్తపింజర ఆమెను కాటు వేయడంతో వేతనదారులు పామును హతమర్చారు. బాధితురాలిని వంగర పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా వైద్యాధికారిణి సుస్మిత దయానా ప్రాథమిక చికిత్స అనంతరం రాజాం సీహెచ్‌సీకి 108 వాహనంలో తరలించారు.
సెల్‌ఫోన్ల రికవరీ
శృంగవరపుకోట: చోరీకి గురైన సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో ఎస్.కోట పోలీసులు చురుగ్గా ఉన్నారు. ఇటీవల చోరీకి గురైన సెల్‌ఫోన్లను ట్రేస్ చేసి రూ.60వేల ఐక్యూ00, రూ.25వేల మోటోరోలా, రూ.16వేల వివో, రూ.20వేల రెడ్‌మీ, రూ.20వేల ఒప్పో, రూ.15వేల వివో, రూ.19వేల రియల్‌మీ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఎస్.కోట సీఐ నారాయణమూర్తి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదుదారులకు అందజేశారు. ఫోన్ల వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, తెతిసీతెలియక చేసే తప్పిదాలతో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు.
సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని
ముగ్గురికి గాయాలు
సీతంపేట: సెప్టిక్ ట్యాంకర్ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. సీతంపేటలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. నాయుడు మల్లి గ్రామం నుంచి సీతంపేటకు విద్యుత్ లైన్‌మన్ పాలక నాగేశ్వరరావు ఆయన కుమారుడు రోహిత్ ద్విచక్రవాహనంపై వస్తున్నారు. కొత్తూరు నుంచి పాలకొండవైపు ఎదురుగా వస్తున్న సెప్టిక్ ట్యాంకర్ కొండపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి వారి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇదే క్రమంలో సైకిల్ తొక్కుకుని పక్క నుంచి కె.శివశంకర్ అనే విద్యార్థి వస్తుండగా ట్యాంకర్ తగిలి కిందపడడంతో స్వల్పగాయాలైనట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఉచిత ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ శిక్షణ
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన నిరుద్యోగ గ్రామీణ యువతీ యువకులకు ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్‌బీఐఆర్‌సెటీ) సువర్ణావకాశం కల్పిస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోర్సుల్లో శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం 31 రోజుల పాటు సాగే ఈ ఉచిత శిక్షణలో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ రంగాల్లో స్వయం ఉపాధి సాధించడానికి అవసరమైన పూర్తి స్థాయి నైపుణ్యాలను, మెలకువలను నిపుణులు నేర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 9959521662, 9985787820 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


