రిజిస్ట్రేషన్‌లో చేతివాటం.. నివేదికలో క్లీన్‌చిట్‌! | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌లో చేతివాటం.. నివేదికలో క్లీన్‌చిట్‌!

Jun 17 2026 12:40 AM | Updated on Jun 17 2026 12:40 AM

రిజిస్ట్రేషన్‌లో చేతివాటం.. నివేదికలో క్లీన్‌చిట్‌!

సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరులోని డగ్లస్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భూమి రిజిస్ట్రేషన్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే ఆరోపణలు, మ్యుటేషన్‌ ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు, శాఖాపరమైన విచారణలో ఫిర్యాదుదారుడు రేగు మహేష్‌ లేవనెత్తిన కీలక అంశాలకు సమాధానం లేకపోవడం వంటివి ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. సొంత శాఖ అధికారుల విచారణతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయా? లేక వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే జరిగిందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఫిర్యాదుదారుడు లేవనెత్తిన కీలక అంశాలకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్‌ నిబంధనల ప్రకారమే జరిగిందని అధికారులు క్లీన్‌ చిట్‌ ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది.

అంతా సవ్యమైతే.. ఇన్ని రోజులు

దాగుడు మూతలు ఎందుకు?

గత నెల 16న సాలూరు ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని సర్వే నంబర్‌ 175/1లో 1.40 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేశారు. సాలూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమిని వాణిజ్య భూమిగా కాక.. వ్యవసాయ భూమిగా పరిగణించి రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.5 కోట్ల మేర ఆదాయ నష్టం కలిగిందన్న ఆరోపణలున్నాయి. భూమి మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్‌ విషయంలోనే అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ అంశాన్ని రెగ్యులర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ నాగరాజు విచారణ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ జిల్లా రిజిస్ట్రార్‌ పార్వతి.. తన నివేదికలో రిజిస్ట్రేషన్‌ నిబంధనల మేరకే చేశారని చెప్పుకోవడం వివాదాస్పదంగా మారింది. 1978లో ఏర్పాటైన డగ్లస్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు సంబంధించిన చైర్మన్‌ శామ్యూల్‌ గోడే వారసుడిగా, ఆయన కుమారుడు జోసెఫ్‌ డేనియల్‌ గోడేను రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన రికార్డులు లేవు. ఈ పరిస్థితుల్లో 2025లో కొత్తగా ఏర్పాటైన మరో సొసైటీ పేరుతో భూమి మ్యుటేషన్‌ జరగడం వెనుక కూడా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గత నెల 16న మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తికావడం, అదే రోజు రెగ్యులర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ నాగరాజు సెలవులో ఉండడం, ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్‌ పూర్తి కావడం యాధృచ్ఛికమా లేక ప్రణాళికాబద్ధమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు

ఈ మొత్తం వ్యవహారంలో రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఆదేశాలు, ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మ్యుటేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు జరిగిన చర్యలన్నీ ఉన్నతస్థాయి పర్యవేక్షణలోనే అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరిందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌పై ఎలాంటి శాఖాపరమైన చర్యలనూ జిల్లా రిజిస్ట్రార్‌ సిఫార్సు చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు, శాఖ ఉన్నతాధికారుల ప్రోత్సాహం వల్లే ఈ రిజిస్ట్రేషన్‌ జరిగిందని ఫిర్యాదుదరారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సర్వే నంబర్‌ 175/1లోని మొత్తం 3.14 ఎకరాల్లో 1.40 ఎకరాల రిజిస్ట్రేషన్‌ మాత్రమే అయ్యింది. ఇప్పుడు మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, లేకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.

సాలూరు ‘డగ్లస్‌’సొసైటీ స్థల వ్యవహారంలో నిజాలు దాచిన నివేదిక

సొంత శాఖ అధికారులతో విచారణపై అనుమానాలు

మ్యుటేషన్‌ మిస్టరీ... రిజిస్ట్రేషన్‌ రహస్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement