సయోధ్య కుదిరినట్లేనా? | - | Sakshi
Sakshi News home page

సయోధ్య కుదిరినట్లేనా?

Jun 17 2026 12:40 AM | Updated on Jun 17 2026 12:40 AM

సాక్షి, పార్వతీపురం మన్యం: కొన్నాళ్లుగా పార్వతీపురం నియోజకవర్గంలో అధికారులు, ఎమ్మెల్యేకు మధ్య ఉన్న విభేదాలకు తాత్కాలికంగా ఫుల్‌ స్టాప్‌ పడినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ జోనల్‌ కో ఆర్డినేటర్‌ ఎ.రాధాకృష్ణల సమక్షంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. జిల్లా పర్యటనకు మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడు, జోనల్‌ కో–ఆర్డినేటర్‌ ఎ.రాధాకృష్ణ వచ్చారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి విచ్చేశారు. సమావేశం ముందు, తర్వాత ప్రత్యేకంగా కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి, టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌ చంద్రలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు.. ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర – కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి మధ్య ఉన్న విభేదాలు.. ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర – టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి నడుమ వివాదాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. విభేదాలకు దూరంగా ఉండాలని హితవు పలికినట్లు సమాచారం. పార్వతీపురం పట్టణంలో స్థల రిజిస్ట్రేషన్లపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే బహిరంగ సవాల్‌ విసిరారు. వాస్తవానికి డీఆర్సీ సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర బహిరంగంగానే విరుచుకుపడతారని అంతా భావించారు. రాజీ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలించడంతో సమావేశంలో చర్చ పెట్టి.. ఎమ్మెల్యే చెప్పిన మాట అధికారులంతా వినాల్సిందేనన్న భావనతో ముగించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న మంత్రి మాట అధికారులకు ఉపశమనం కల్పించింది.

డోలీలోనే మృత్యు ఒడికి

కొమరాడ: డోలీలోనే ఓ గిరిజనుడు ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన కొమరాడ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. నయా పంచాయతీ వాటాకోస్‌ గ్రామానికి చెందిన మెల్లిక వెంకటరావు(60) నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు గ్రామం నుంచి డోలీలో వనకబడికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి మంగళవారం డోలీలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. దీంతో ఆయన భార్య పారమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.

నీట్‌ పరీక్షకు

ఏర్పాట్లు పూర్తి

హాజరుకానున్న 1801 మంది అభ్యర్థులు

విజయనగరం అర్బన్‌: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న రీ–నీట్‌ యూజీ ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1,801 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్షను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 08922–236947 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

నీట్‌ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం

నీట్‌ రీ–ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ ప్రత్యేక ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, విశాఖపట్నం, గాజు వాక, కూర్మన్నపాలెం, ఎస్‌.కోట, ఆండ్ర, జక్కువ, సింహాచలం, అనకాపల్లి ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వసంత, షికారుగంజి, బొప్పడాం, గరికివలస, కొండగండ్రేడు, కందివలస, చింతపల్లి, తిప్పలవలస తదితర గ్రామాల అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సు నడపనున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement