● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: మహిళలను ఎవరు దూషించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రిలోకేష్‌లు రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు, అకృత్యాలపై ఎందుకు స్పందించడం లేదని, ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా అంతుచూస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు నేడు కనీసం స్పందించక పోవడం శోచనీయమన్నారు. పాలకొండ మండలం తుమరాడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ బిడ్డిక ఉషారాణిని దారుణంగా హత్య చేశారని, దీనిపై పార్వతీపురం మన్యంజిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనులు పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ పోరాటాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, హోం శాఖమంత్రి అనిత, గిరిజనసంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణిలకు కనిపించకపోవడం, వినిపించకపోవడం శోచనీయమన్నారు.
బాధిత కుటుంబాన్ని
పరామర్శించకపోవడం దారుణం
రెండు జిల్లాల గిరిజనులు ధర్నాలు, ఆందోళనలు చేసి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ర్యాలీ లు, ధర్నాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. కనీసం నేటి వరకు ఆ కుటుంబాన్ని మంత్రులు సంధ్యారాణి,అనితలైనా పరామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. హత్యకు గురైన ఉషారాణి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గిరిజన సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని, వారి డిమాండ్లను ఈ ప్రభుత్వం పట్టించుకోదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


