మృత్యు పిడుగు | - | Sakshi
Sakshi News home page

మృత్యు పిడుగు

Jun 16 2026 12:58 AM | Updated on Jun 16 2026 12:58 AM

పూరింటిపై పడిన పిడుగు

పిడుగుపాటుకు ఇద్దరు బలి

విషాదంలో కుటుంబ సభ్యులు

భామిని/మెరకముడిదాం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు చోట్ల సోమవారం సాయంత్రం పిడుగుల వాన కురిసింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేటకు చెందిన పెనుగుదురు రాజశేఖర్‌(20) భామిని మండల సొలికిరి గ్రామంలోని తాతగారి ఇంటికి వేసవిసెలవుల కోసం వచ్చాడు. సొలికిరి గ్రామ యువకులతో కలిసి వంశధార తీరంలో సాయంత్రం క్రికెట్‌ ఆడుతుండగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాజశేఖర్‌ పిడుగుపాటుకు గురయ్యాడు. వెంటనే మిగిలిన జట్టు సభ్యులు బాలేరు పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో తోటి స్నేహితులు, తాత, అమ్మమ్మలు పూడి సింహాచలం, సరస్వతి బోరున విలపించారు.

మెరకముడిదాం మండలంలోని సాతాంవలస గ్రామంలో సోమవారం సాయంత్రం పల్లికల గౌరమ్మ (53) పూరింటిపై పిడుగు పడింది. దీంతో పూరిగుడిసెలో ఉన్న గౌరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గౌరమ్మ భర్త ఇదివరకే మృతి చెందగా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుదరాయవలస ఎస్‌ఐ జె.లోకేష్‌కుమార్‌ కేసునమోదు చేశారు.

గిరిజన బిడ్డలకు హేతుబద్ధీకరణ కష్టాలు

చదువుకు దూరమవుతున్న గిరిజన విద్యార్థులు

సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేతుబద్ధీకరణతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. హేతుబద్ధీకరణలో అశాసీ్త్రయత వల్ల గిరిజన పిల్లలు తీవ్రంగా నష్టపోనున్నారు. గతేడాది వరకు 3 నుంచి పదో తరగతి వరకు ఆశ్రమోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేవారు. హేతుబద్ధీకరణ కారణంగా ఈ ఏడాది అయిదు నుంచి పదో తరగతి వరకు కొన్ని, 3 నుంచి 7వ తరగతి వరకు ఇంకొన్ని ప్రత్యేకంగా పాఠశాలలు నడవనున్నాయి. ఒక్క పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోనే పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లోని 3 నుంచి 7వ తరగతి వరకు నిర్వహణకు గుర్తించిన పాఠశాలలు బీరుపాడు, గొరడ, కెమిశీల, కోసంగిభద్ర, ఎండభద్ర, పీటీమండ, రావికోన, నేరెళ్లవలస ఉన్నాయి. ఇవన్నీ మారుమూల కొండకోన ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇష్టమైన పాఠశాలలో చదువుకునే అవకాశం పిల్లలకు ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో తమ బిడ్డలను ఎక్కడ చేర్చాలో తెలియక అయోమయానికి లోనవుతున్నారు. వీరిని చేర్చుకోవడంపై ఉపాధ్యాయులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. హేతుబద్ధీకరణ వల్ల జియ్యమ్మవలస, కురుపాం మండలం టొంపలపాడు పాఠశాలలు పూర్తిగా మూసివేతకు గురవుతున్నాయి.

ఐదో తరగతి వరకు కొనసాగించాలి..

హేతుబద్ధీకరణ వల్ల గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్‌కుమార్‌, తాడంగి సాయిబాబు, బొండపల్లి జనార్దన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని జీపీఎస్‌ పాఠశాలల్లో ఐదో తరగతి వరకు కొనసాగించి, అదనంగా మరో ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి వరకు కొనసాగించాలని, కొన్నింటిని ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు.

నేడు తల్లికి వందనంపై సమీక్ష

పార్వతీపురం: పార్వతీపురంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో తల్లికి వందనం పేరిట మంగళవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నట్టు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా మంత్రి జి.సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ టి.జగదీశ్వరీ, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొంటారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement