● అధికారుల ’మ్యాపింగ్’ మాయాజాలం..
● కళ్లెదుట తప్పు కనిపిస్తున్నా సరిదిద్దలేని దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం
పార్వతీపురం రూరల్: క్షేత్రస్థాయిలో వాస్తవాలు పట్టవు.. ఆన్‌లైన్‌లో రికార్డులు తప్పుల తడకలైనా సరిదిద్దే నాథుడు ఉండడు. చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు, పాలకుల నిర్లక్ష్యానికి వీరఘట్టం మండలం తుడి గ్రామంలో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఒకే గ్రామంలో ’అన్ను ప్రసాదరావు’ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండడమే ఈ అనర్థానికి మూలం. ఒక ప్రసాదరావు కుమారుడు సాత్విక్ ఎనిమిదో తరగతి చదువుతుండగా, మరో ప్రసాదరావు కుమారుడు పోలీసు శాఖలో ఎస్సైగా ఉన్నారు. కానీ, ప్రభుత్వ అధికారుల ’హౌస్ మ్యాపింగ్’ నిర్వాకం పుణ్యమా అని ఎనిమిదో తరగతి పిల్లాడు కాస్తా రికార్డుల్లో ’ఎస్సై’గా మారిపోయాడు. ఫలితంగా ఆ పేద విద్యార్థి సాత్విక్‌కు రావాల్సిన ‘తల్లికి వందనం’ సాయాన్ని గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది. సాంకేతిక లోపంతో జరిగిన ఈ చిన్న తప్పును సరిదిద్దలేని చేతకానితనంలో పాలకుల వ్యవస్థ ఉందా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తప్పు మీరే చేసి, శిక్ష పేద విద్యార్థికి వేస్తారా?‘ అంటూ బాధితుడు అధికారుల చుట్టూ రెండేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనీస స్పందన కరవైంది. ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నా.. కింది స్థాయిలో కనీస సమస్యలు పరిష్కారం కావడం లేదు. విసిగిపోయిన ఇద్దరు ప్రసాదరావులు సోమవారం నేరుగా కలెక్టరేట్ మెట్లెక్కారు. మనుషులు ఎదురుగా కనిపిస్తున్నా.. సాక్ష్యాలు ఇంత స్పష్టంగా ఉన్నా.. ఓ చిన్న ఆన్‌లైన్ తప్పును సరిదిద్ది పేద విద్యార్థికి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది.


