సీతంపేట: గిరిజన యువతి బిడ్డిక ఉషారాణిని అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీతంపేటలో సోమవారం న్యాయపోరాట ర్యాలీ నిర్వహించారు. సంతమార్కెట్ నుంచి ఐటీడీఏ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. అనంతరం ఐటీడీఏ ముఖద్వారం వద్ద బైఠాయించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను బహిరంగంగా ఉరితీయాలని నినదించారు. బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్‌గ్రేషియో ప్రకటించి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇవ్వాలని జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నిందితుల ఆస్తులను జప్తుచేసి ఉషారాణి కుటుంబానికి అప్పగించాలన్నారు. నిరసన ప్రదేశానికి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టంచేశారు. అంతకముందు కలెక్టర్‌కు ఆదివాసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు కె.ధర్మారావు, బి.ఉమామహేశ్వరరావు, ఎ.సుందరరావు, వాబయోగి, యూకే రవికుమార్, బి.రామ్మోహన్‌రావు, పి.పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.


