హద్దులు గీద్దాం.. ఆక్రమణలను అడ్డుకుందాం | - | Sakshi
Sakshi News home page

హద్దులు గీద్దాం.. ఆక్రమణలను అడ్డుకుందాం

Jun 16 2026 12:58 AM | Updated on Jun 16 2026 12:58 AM

చెరువుల రక్షణ– నీటి సంరక్షణ లక్ష్యం

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని చిన్న నీటిపారుదల చెరువుల పరిరక్షణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, ఆక్రమణల నివారణ లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 2,816కు పైగా చెరువులున్నాయి. పార్వతీపురం, పాలకొండ, సాలూరు వంటి పట్టణాలతోపాటు, గ్రామాల్లోనూ అనేక చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. దీనివల్ల వీటి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఫలితంగా వర్షాకాలంలో నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. రైతులు సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల అసలు హద్దులను గుర్తించేందుకు రెవెన్యూ శాఖ ద్వారా పెగ్‌ మార్కింగ్‌ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది. అనంతరం ఉపాధి హామీ పథకం వేతనదారులతో చెరువు హద్దుల వెంట సరిహద్దు కందకాలు తవ్విస్తున్నారు. ప్రస్తుతం 116 చెరువులకు సంబంధించి పెగ్‌ మార్కింగ్‌ పూర్తయ్యింది. 61 చెరువుల్లో సరిహద్దు కందకాల తవ్వకం ప్రారంభించారు. రెవెన్యూ, నీటిపారుదల, గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాయి.

చెరువుల రక్షణ, నీటి సంరక్షణ, రైతు సంక్షేమం లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని ద్వారా చెరువుల హద్దులు స్పష్టంగా గుర్తించవచ్చు. భవిష్యత్తులో ఆక్రమణలను అరికట్టడంతో పాటు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు మరింత సాగునీరు అందుబాటులోకి రానుంది. మిగిలిన అన్ని చెరువుల్లోనూ త్వరితగతిన పెగ్‌ మార్కింగ్‌, సరిహద్దు కందకాల పనులు పూర్తి చేయనున్నాం.

– ఎన్‌.ప్రభాకరరెడ్డి, కలెక్టర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement