బడుగులపై పిడుగు | - | Sakshi
Sakshi News home page

బడుగులపై పిడుగు

Jun 15 2026 12:47 AM | Updated on Jun 15 2026 12:47 AM

ఏడుగురు మహిళలకు అస్వస్థత

వీరఘట్టం/పాలకొండ: ఉపాధి పనులకు వెళ్తున్న మహిళా వేతనదారులపై పిడుగుపడింది. ఈ ప్రమాదవార్త గ్రామంలో తెలియడంతో ఊరంతా ఒక్కసారిగా ఘొల్లుమంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య చికిత్స సకాలంలో అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఊరంతా ఊపిరిపీల్చుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టం మండలం అడారు పంచాయతీ పరిధి చేబియ్యంవలస గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఉపాధి పనులకు వెళ్తున్న ఏడుగురు మహిళలు పిడుగు పాటు బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన గుడుపూరు జ్యోతి, చిన్ని సంగమ్మ, నాగళ్ల యశోదమ్మ, ముద్దాడ గంగమ్మ, నాగళ్ల లక్ష్మి, చిన్న గౌరమ్మ, నాగళ్ల సిమ్మమ్మలు గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద ఉపాధి పనులు చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారికి సుమారు 50 మీటర్ల దూరంలో ఓ చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో వారంతా ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే స్థానికులు వారిని బిటివాడ పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే క్షతగాత్రులకు చికిత్స అందజేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ధనుంజయ, శంకరరావు, రేరాజు, రాములను క్షతగాత్రుల బంధువులు, వైద్యాధికారులు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement