ఒడిశా విలేకరులపై మంత్రి ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

ఒడిశా విలేకరులపై మంత్రి ఆగ్రహం

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

ఒడిశా విలేకరులపై మంత్రి ఆగ్రహం

సాలూరురూరల్‌: ఆంధ్రా ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రామాల్లో బుధవారం జరిగిన రహదారి ప్రారంభ సమావేశంలో మంత్రి సంధ్యారాణి ఒడిశా నుంచి వచ్చి కవరేజ్‌ చేస్తున్న పత్రికా విలేకరులపై విరుచుకు పడ్డారు. వివాదాస్పద గ్రామాల్లో ఒకటైన నేరెళ్ల వలసలో నిర్వహించిన బహిరంగ సభకు గంజాయి భద్ర, సారిక తదితర పంచాయతీల్లోని గిరిజనులను తీసుకువచ్చారు. వివాదాస్పద గ్రామాలు కావడంతో ఒడిశాకు సంబంధించిన విలేకరులు కూడా ఈ సభకు హాజరయ్యారు. వారు విధి నిర్వహణలో భాగంగా కార్యక్రమాన్ని ఫొటోలు వీడియోలు తీసుకుంటున్న సమయంలో వేదికపై కూర్చున్న మంత్రి సంధ్యారాణి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నించారు. దీంతో పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కుతారా? అంటూ ఒడిశా పత్రికా విలేకరులు అంతా అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.

పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు

మంత్రి సంధ్యారాణి ఒడిశా విలేకరులను ప్రశ్నించిన తీరును మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తప్పుబట్టారు. వివాదాస్పద గ్రామాల విషయంలో తొలి తప్పు తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామాల్లో జన్మ భూమి కార్యక్రమాన్ని పెట్టి ఒడిశా ప్రభుత్వంతో గొడవకు కారణమయ్యారన్నారు. అప్పటినుంచి ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా వివాదాస్పద గ్రామాల్లోకి వెళ్లింది లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాలి నడకన వివాదాస్పద గ్రామాలు తిరిగి అక్కడికి చేరుకున్న విషయం గుర్తు చేశారు. ఆర్టికల్‌ 19 ప్రకారం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదన్న విషయం మంత్రి సంధ్యారాణి తెలుసుకోవాలని హితవు పలికారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement