డీఎస్సీలో అవకతవకలపై నిరుద్యోగుల ఆగ్రహజ్వాల | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో అవకతవకలపై నిరుద్యోగుల ఆగ్రహజ్వాల

Jun 2 2026 12:44 AM | Updated on Jun 2 2026 12:44 AM

విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అవకతవకలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పోర్ట్స్‌ కోటాతో సహా పలు విభాగాల్లో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టి అధిక మార్కులు సాధించిన నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు. పోస్టులను డబ్బులకు అమ్మేశారంటూ ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ముందుగా విజయనగరం కంటోన్మెంట్‌ మున్సిపల్‌ పార్క్‌ నుంచి రాజీవ్‌ యువకేంద్రం మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌ డౌన్‌డౌన్‌, తక్షణమే రాజీనామా చేయాలంటూ నినదించారు. మెగా డీఎస్సీ కాదు... ఇది దగా డీఎస్సీ, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు, మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు దాచారు?, ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎవరికిచ్చారు? అంటూ నినాదాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది యువత, డీఎస్సీ అఽభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగుల నినాదాలతో కలెక్టరేట్‌ పరిసరాలు హోరెత్తాయి. నిరుద్యోగులకు న్యాయం చేసేవరకు పోరుబాట సాగిస్తామని స్పష్టంచేశారు. ర్యాలీ అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌కు వినతిపత్రం అందజేసి డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కౌశిక్‌, బొత్స చైతన్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వాకాడ సతీష్‌, పైడిపునాయుడు, శంకరరావు, వావిలిపల్లి రమణారావు, జిల్లా స్టూడెంట్‌ వింగ్‌ అధ్యక్షుడు కరుమజ్జి సాయి, టౌన్‌ అధ్యక్షుడు చెల్లూరి భార్గవ్‌, జిల్లా పబ్లిసిటీ వింగ్‌ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎస్సీ సెల్‌ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువత భవిష్యత్‌తో చెలగాటం

డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన పరిణామాలు చూస్తుంటే నిరుద్యోగ యువతకు న్యాయంచేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదు. అర్హులైన అభ్యర్థులను పక్కనపెట్టి అనుమానాలకు తావిచ్చేలా నియామకాలు నిర్వహించడం బాధాకరం. వేలాది మంది యువత కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే వారి ఆశలను ప్రభుత్వం దెబ్బతీసింది. డీఎస్సీ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేవరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది.

– బొత్స అనూష,

వైఎస్సార్సీపీ యువ నాయకురాలు

నకిలీ క్రీడా సర్టిఫికెట్లతో ఉద్యోగాలా?

స్పోర్ట్స్‌ కోటాలో ఎప్పుడూ వినని గేమ్స్‌ పేర్లతో, అనుమానాస్పద క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా కొందరికి ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేసి, అర్హతలేని వారికి లబ్ధి చేకూర్చారనే అనుమానాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అర్హులైన క్రీడాకారులకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తాం.

– బడ్డుకొండ ప్రదీప్‌ నాయుడు,

నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు

డీఎస్సీపై వచ్చిన ప్రతి ఆరోపణపై సమగ్ర విచారణ జరగాలి

పేపర్‌ లీకేజీ, డేటా డిలీట్‌, ఎంపికల ప్రక్రియలో పారదర్మకత లేకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ ప్రక్రియపై నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం.

– అల్లు అవినాష్‌, యువజన విభాగం

అధ్యక్షుడు

యువత ఆశలకు గండి

డీఎస్సీ నియామకాల ప్రక్రియలో వచ్చిన ఆరోపణలు నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అర్హులకు అన్యాయం జరగకూడదు. స్వతంత్ర విచారణ జరిపి నిజాలను

బయటపెట్టాలి.

– శోభా స్వాతిరాణి, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన

విజయనగరంలో మహాధర్నా

పాల్గొన్న వేలాదిమంది నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ యువజన నాయకులు

మెరిట్‌కు టీడీపీ సమాధి కట్టిందంటూ మండిపాటు

మెరిట్‌లిస్ట్‌ ఎందుకు దాచారు?..

డేటా ఎందుకు తొలగించారు?

ప్రభుత్వాన్ని నిలదీసిన యువత

డీఎస్సీ నియామకాలపై సమగ్ర

విచారణ కోరుతూ

జేసీ సేతు మాథవన్‌కు వినతిపత్రం

Advertisement
 
Advertisement
Advertisement