పేరుకే జిల్లా.. ప్రయాణ కష్టం దేవుడికే ఎరుక!
సాక్షి, పార్వతీపురం మన్యం:
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జో న్ అధికారికంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. రైల్వేశాఖ పరంగా ఇప్పటివరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ జోన్ పరిధిలో ఈ ప్రాంతం ఇక మీదట విశాఖ జోన్ పరిధిలోకి వచ్చింది. భువనేశ్వర్ పరిధి లో ఉండడం వల్ల.. జిల్లా మీదుగా పలు రైళ్ల విషయంలో నిర్లక్ష్యం ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. ఒడిశా, హౌరా ప్రాంతాల మీద ఉన్న శ్రద్ధ.. ఇటు వైపు కొరవడింది. అరకొర రైళ్లు, పరిమిత పాసింజ ర్ బళ్లు, ఎవరికీ ఉపయోగపడని వేళలు రైల్వే ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడంతో ఇకమీదనైనా రైలు ప్రయాణ కష్టాలు తీరుతాయా.. అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.
వేలాది మందికి రైలు ప్రయాణమే దిక్కు..
జిల్లాలో పార్వతీపురం(బెలగాం), పార్వతీపురం టౌన్, సీతానగరం, నర్సిపురం, గుమడ, కూనేరు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. జిల్లా విభజన తర్వాత విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి బొబ్బి లి, పార్వతీపురం, సాలూరు వైపు ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. తప్పనిసరి బదిలీలు కావడం వల్ల పిల్లల చదువు, ఇతర ఇబ్బందులతో కుటుంబాలను వదిలి ఇక్కడకు రాలేక.. మరో మార్గం దొరకక వందలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణం అధిక సమయం కావడంతో పాటు.. చార్జీల భారం కూడా మోయలేనంతగా పడుతుంది. దీనివల్ల రైలు ప్రయాణమే దిక్కు అవుతోంది. వీరితోపాటు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ఆస్పత్రి పని మీద వెళ్లి వచ్చేవారు ఇలా, వేలాదిమంది నిత్యం ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ మార్గంలో కేవలం మూడే పాసింజర్ సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి కూడా ఏ సమయానికి వస్తాయో.. ఏ సమయానికి గమ్య స్థానం చేర్చుతాయో తెలియని పరిస్థితి. గంటలకొద్దీ ఆలస్యం చేస్తుండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఆస్పత్రి పనిమీద వెళ్లేవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. నిత్యం నడిచే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు మూడు, నాలుగే ఉన్నాయి. వీక్లీ బళ్లు ఉన్నా.. దూర ప్రాంతం నుంచి రావడం వల్ల ఒక్క రోజు కూడా సమయానికి నడిచిన సందర్భాలు ఉండవు. దీనికితోడు సరిపడా బోగీలు వేయకపోవడం వల్ల కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నా రు. కొత్త రైల్వే జోన్ కింద కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపయోగపడేలా పార్వతీపురం మార్గంలో అదనపు రైలు సర్వీసులు నడపాలని, అన్ని వర్గాలకూ అక్కరకు వచ్చేలా కచ్చితమైన వేళలు పాటించాలని, బోగీల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది.
సాలూరుకు రైలు కూత వినిపించేనా?
ఎన్నో ఏళ్లుగా సాలూరుకు రైలు బండి.. అదిగో, ఇదిగో అని ఊరిస్తూనే ఉంది. పలుమార్లు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. గత సారి మంత్రి సంధ్యారాణి అట్టహాసంగా ట్రయల్ రన్ ప్రక్రియను జెండా ఊపి కూడా ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ బండి కూత ఈ ప్రాంత వాసులకు వినిపించడం లేదు. విశాఖ–విజయనగరం ప్యాసింజర్ రైలు(మెము)ను సాలూరు వరకు పొడిగిస్తున్న ట్లు పలుమార్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఎవరికీ అనుకూలం కాని సమయం ప్రకటించడంతో స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ బండి మాత్రం పట్టలెక్కలేదు. సాలూరు విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో సాలూరు–బొబ్బిలి మధ్య నడుస్తున్న రైలు బస్సు ను రైల్వే శాఖ ఆపేసింది. తరువాత కరోనా తగ్గినా ఈ రైలు బస్సును మాత్రం నడపడం లేదు. కొత్త జో న్‌లో అయినా సాలూరు రైలు బండికి పచ్చ జెండా ఊపాలని ఆ ప్రాంత వాసులు ఆకాంక్షిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇప్పటికీ భయమే. ఉన్నవే అరకొర రైళ్లు. దాదాపు అన్ని బళ్లూ కిక్కిరిసి ఉంటాయి. విశాఖ–విజయనగరం–బొబ్బిలి–ఒడిశా(రాయగడ) వైపు ప్రధాన మార్గమైనప్పటికీ.. రైల్వే శాఖ ఎందుకనో ఇటు చిన్నచూపు చూస్తోంది. విజయనగరం – శ్రీకా కుళం – హౌరా మార్గంలో ప్రతి అరగంటకూ ఒక రైలు బండి కచ్చితంగా నడుస్తుంది. పాసింజర్/ ఎక్స్‌ప్రెస్/ సూపర్‌ఫాస్ట్ సర్వీసులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇదే సమయంలో నిత్యం వేలాది మంది ప్రయాణించే పార్వతీపురం మార్గంలో నడిచే రైళ్లు రోజులో 10 కంటే తక్కువగానే ఉంటాయి. సరిపడా సర్వీసులు ఉండవు. అవీ సమయానికి రావు. రద్దీకి తగ్గ బోగీలూ వేయరు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు అవస్థలు పడి, కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. లోపలికి అడుగు పెట్టేందుకు కూడా ఖాళీ లేని విధంగా ప్రయాణికులు ఉంటున్నా.. తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో రైల్వే శాఖది ఎందుకనో
అంతులేని నిర్లక్ష్యమే కనిపిస్తోంది.


