● 200 వినతులు స్వీకరించిన
అధికారులు
విజయనగరం కలెక్టరేట్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్), ’రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. మొత్తం 200 వినతులు రాగా అత్యధికంగా 95 అర్జీలు రెవెన్యూ శాఖకు చెందినవి కావడం విశేషం. ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ ఎం.రామ్‌సుందరరెడ్డి రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటలో భాగంగా చీపురుపల్లిలో ఇచ్చిన హామీల అమలుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య తీవ్రత తెలుసుకోవాలని సూచించారు. పీజీఆర్‌ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, బి.శాంతి, కళావతి, ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, సీపీఓ బాలజీ, డీఆర్‌డీఏ, హౌసింగ్, మైక్రో ఇరిగేషన్ పీడీలు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మార్క్‌ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
శాఖల వారీగా వచ్చిన వినతులు..
రెవెన్యూ శాఖకు సంబంధించి 95 వినతులు వచ్చాయి. అలాగే డీఆర్‌డీఏ–24, పంచాయతీరాజ్: 17, మున్సిపల్–6 విద్యుత్ శాఖ–5, హౌసింగ్–4, డీఎంహెచ్‌ఓ–1, డీసీహెచ్‌ఎస్–3, గ్రామ సచివాలయ శాఖ–4, విద్య శాఖ–1, ఇతర శాఖలకు సంబంధించి 40 వినతులు అందాయి.


