ఉపాధ్యాయులకు వాచ్‌మెన్ విధులా?
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు రాత్రి కాపలాదారు విధులు వేయడం ఎంతవరకు సమంజసమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్‌రావు ప్రశ్నించారు. పాఠశాలల్లో రాత్రి బస చేసి 9 గంటలకు, అర్ధరాత్రి 12గంటలకు, తెల్లవారుజామున 6 గంటలకు ఫొటోలు అప్‌లోడ్ చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఎటువంటి సౌకర్యాలూ కల్పించకుండా మహిళా ఉపాధ్యాయులు సైతం పాఠశాలలో బస చేయాలని చెప్పడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీవో కాపీలను మంటల్లో తగలబెట్టారు. మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ రాయాలని నిర్దేశించడం సరికాదన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య సమస్యలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావు, కార్యదర్శి కృష్ణారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: ’వైరస్ రహిత సమాజం–వ్యాధి రహిత బాల్యం’ అనే నినాదంతో జిల్లాలో పల్స్ పోలియో సమరానికి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈనెల 21వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు గురువారం కార్యాలయంలో ప్రకటించారు. ఈ మేరకు పల్స్ పోలియో పోస్టర్‌ను అధికారులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 99,507 మంది చిన్నారులకు రక్షణ కవచంలా రెండు చుక్కల మందు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 905 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం 19 ట్రాన్సిట్ బూత్‌లు, గిరిజన మారుమూల ప్రాంతాల కోసం 42 సంచార (మొబైల్) బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వివరించారు. ఆదివారం బూత్‌లకు రాలేని వారి కోసం 22, 23 తేదీలలో వైద్య సిబ్బంది ’ఇంటింటికీ–చుక్కల మందు’ కార్యక్రమం చేపడతారని తెలిపారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో సాగే ఈ యజ్ఞంలో తల్లిదండ్రులు భాగస్వాములై తమ పిల్లలకు వైకల్యం లేని భవితను అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయ మోహన్, డా.వినోద్, డా.రఘు తదితరులు పాల్గొన్నారు.


