ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి
● చట్టాన్ని పథకంగా మారిస్తే కూలీల హక్కులు కోల్పోతారు
● కలెక్టరేట్ దగ్గర గాంధీజీ విగ్రహం వద్ద సీపీఎం నిరసన
విజయనగరం గంటస్తంభం: గ్రామీణ పేదలకు ఉపాధిని హక్కుగా కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడం ద్వారా ఉపాధికి ఉన్న గ్యారంటీని తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టంలో ఉన్న హక్కులను బలహీనపరిచేందుకే గాంధీజీ పేరు తొలగించి చట్టాన్ని సాధారణ పథకంగా మార్చారని ఆరోపించారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు సాధించుకున్న ఈ చట్టంపై గాంధీజీపై ఉన్న వ్యతిరేకతతోనే కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంటులో ఉన్న మోజారిటీతో కూలీలకు హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చే ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. చట్టం స్థానంలో పథకం అమలులోకి వస్తే ఉపాధికి గ్యారంటీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
కూటమి నేతలు స్పందించాలి
ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా స్పందించడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా టీడీపీ, జనసేన పార్టీలు ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఈ చట్టాన్ని కాపాడుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్, వెంకటేష్, విజయనగరం పట్టణ నాయకులు బుల్లి రమణతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


