ఎస్పీ దామోదర్‌కు ఏబీసీడీ అవార్డు
● అభినందించిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
విజయనగరం క్రైమ్ : డీజీపీ హరీష్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ దామోదర్ అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డును శుక్రవారం అందుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసులు ఛేదించిన ముఖ్య కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డును ఎస్పీ దామోదర్ అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించినందుకు గాను అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన దామోదర్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించి, ఏబీసీడీ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గతేడాది ఏప్రిల్ 22 వ తేదీన ప్రకాశం జిల్లా, ఒంగోలు మెయిన్ రోడ్డు వద్ద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ముప్పవరపు వీరయ్య చౌదరిని కత్తులతో విచక్షణా రహితంగా 49 పోట్లు పొడిచి అక్కడ నుంచి పారిపోయారన్నారు. అనంతరం ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును తొందరగా ఛేదించి నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలపాలని ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం పెంచిందన్నారు. అప్పటి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ డీఎస్పీ స్థాయి అధికారులతో వెంటనే 60 క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, రాత్రింబవళ్లు శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ వ్యవధిలోనే సంచలన హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చి, 9మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారన్నారు. సంచలన హత్య కేసును తక్కువ వ్యవధిలో ఛేదించిన ఎస్పీ దామోదర్‌ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించి, కేసు ఛేదనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందికి నగదు బహుమతి ప్రదానం చేశారు.


