గోడకూలి విద్యార్థికి గాయాలు
శృంగవరపుకోట: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పై అంతస్తులో ఉన్న వాటర్‌ట్యాంక్ గోడకూలి ఓ విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్ నాల్గవవీధిలో ఉన్న త్రినేత్ర డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్‌లో పందిరప్పన్న జంక్షన్‌కు చెందిన వేమలి భార్గవ్ 6వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో భార్గవ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పాఠశాల వెనుక వైపు ఉన్న రేకుల బాత్‌రూమ్‌కు మూత్రవిసర్జనకు వెళ్లాడు. మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పాఠశాల భవనం మూడవ అంతస్తుపైన ఉన్న వాటర్‌ట్యాంక్ గోడ కూలిపోయి బాత్‌రూమ్‌పైన పడిపోవడంతో భార్గవ్ రేకులు, గోడ శిథిలాల మధ్య చిక్కుకు పోయాడు. హఠాత్తుగా వచ్చిన శబ్దంతో వెనుక వీధిలో ఉన్న కార్పెంటర్ వాసు, చిల్డ్రన్ హాస్పిటల్‌లోని నర్స్‌లు వచ్చి శిథిలాలను తొలగించి విద్యార్థిని కాపాడారు. భార్గవ్ తలకు కుడివైపు లోతైన గాయం కాగా, ఎడమకాలు విరిగిపోయింది. స్కూల్‌కు పక్కనే ఉన్న అభినవ్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేయించారు. విషయం తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై నిలదీశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఘటనలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యవైఖరి, నిర్మాణంలో లోపాలే ప్రమాదానికి కారణం ఆరోపించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి విచారణ చేశారు. గాయపడిన భార్గవ్‌కు వైద్యం చేసిన ఆస్పత్రి నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు.


