చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు
● రూ.13వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు
పార్వతీపురం రూరల్: తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. రాత్రి వేళ ఇళ్లలో చొరబడి చేతివాటం ప్రదర్శించిన దొంగలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పదేళ్ల క్రితం నాటి దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సాలూరు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ శుక్రవారం తీర్పు వెలువరిచారు. ఎస్పీ మాధవ్‌రెడ్డి తెలియజేసిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సాలూరు మండలంలోని యరగాడ వలస గ్రామానికి చెందిన కొత్తపల్లి సత్తిపండు 2015లో పని నిమిత్తం రాజమండ్రి వెళ్లాడు. ఈ క్రమంలో ఇల్లంతా ఖాళీగా ఉండడం గమనించిన అదే గ్రామానికి చెందిన కొండగొర్రి రమేష్, ఆలూరి గణపతిలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులపై సమర్పించిన సాక్ష్యాధారాలు, ఏపీపీ మాధవి వినిపించిన బలమైన వాదనలతో నేరం రుజువైంది. దీంతో ముద్దాయిలిద్దరికీ మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.13వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి వివరించారు.
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
భోగాపురం: మండలంలోని అమటాం గ్రామానికి చెందిన కోరాడ సూరి (70) అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోరాడ సూరి కొబ్బరి చీపుళ్లు తయారు చేసి వాటిని విశాపట్నంలో విక్రయిస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న విశాఖపట్నంలో చీపుళ్లను విక్రయించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సూరిని తగరపువలస ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై తిరుపతి తెలిపారు.
జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు నెల్లిమర్ల క్రీడాకారులు
నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు నెల్లిమర్ల రిక్రియేషన్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులు కె.సురేష్, ఎం.నాని తెలిపారు. ఈ నెల 22 నుంచి కేరళ రాష్ట్రంలో జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు బి.రామకృష్ణ, బి. వరుణ్‌లు ఎంపికై నట్లు తెలిపారు. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ అనంతపురం జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీకి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు రామకృష్ణ, వరుణ్, సంతోష్ కుమార్ జాతీయస్థాయి పోటీల్లో రాణించి, విజేతలుగా నిలవాలని క్లబ్ ప్రతినిధులు, పూర్వ శిక్షకుడు కోల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
రోడ్లపై పశువులను
విడిచిపెడితే కేసులు
విజయనగరం క్రైమ్ : రోడ్లపై పశువులను విడిచిపెడితే సంబంధిత యజమానులపై కేసులు పెడతామని ఎస్పీ దామోదర్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో రహదారులపై పశువులు విచ్చలవిడిగా స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వీటి విచ్చలవిడి సంచారం వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.


