సత్ప్రవర్తనతో శిక్ష పూర్తిచేయండి
● విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
పార్వతీపురం: సత్ప్రవర్తనతో ఖైదీలు శిక్షను పూర్తిచేయాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె సబ్ జైలును తనిఖీచేసి వసతులను, రికార్డులను, జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యమైన ఆహారం అందుతోందా? లేదా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని, నైతిక విలువలను పెంపొందించుకుంటే మానసిక ప్రఽశాంతత లభిస్తుందని ఖైదీలకు తెలిపారు. ఖైదీల ఫిర్యాదులు, అభ్యర్ధనలు, ఏవైనా సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సబ్ జైలు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పార్వతీపురం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదరరావు, విజయనగరం సీనియర్ జడ్జి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, పార్వతీపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్పిన్ తదితరులు పాల్గొన్నారు.


