సైన్స్ ఫెయిర్ విజయవంతం
విజయనగరం అర్బన్: జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్–2025ను పాఠశాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత పదర్శన కార్యక్రమాన్ని ఆర్‌డీఓ దాట్ల కీర్తి ప్రారంభించారు. ఈ సైన్స్ ఫెయిర్‌లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘సస్టైనబుల్ అగ్రికల్చర్, పర్యావరణ నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, క్రీడలు అండ్ వినోదం, ఆరోగ్యం అండ్ పరిశుభ్రత, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ’ వంటి అంశాలపై వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ఉత్తమ వైజ్ఞానిక ప్రాజెక్టులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. విద్యార్థుల గ్రూప్ కేటగిరి విజేతలలో అంశాల వారిగా ఏడు ప్రదర్శనలు ఎంపిక చేశారు.
జిల్లా స్థాయి విజేతలు వీరే
సైన్స్ ఫెయిర్‌లో సస్టైన్‌బుల్ అగ్రికల్చర్ అంశంలో జెడ్పీహెచ్‌ఎస్ చీపురుపల్లి (బాలికలు), ‘పర్యవరణ నిర్వహణ–పర్యావరణ హిత ప్రత్నామ్నాయాలు’ అనే అంశంలో జెడ్పీహెచ్‌ఎస్ జామి, ‘గ్రీన్ ఎనర్జీ–ఈవీ చార్జింగ్ స్టేషన్’ అనే అంశంలో జెడ్పీహెచ్‌ఎస్ రామభద్రపురం, ‘అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు–మాగ్నటిక్ గేర్స్’ అనే అంశంలో వల్లాపురం జెడ్పీహెచ్‌ఎస్, ‘నీటి సంరక్షణ–డ్రైయిన్ ఓవర్‌ఫ్లో గుర్తింపు వ్యవస్థ’ అనే టాపిక్‌లో రామతీర్ధం జెడ్పీహెచ్‌ఎస్, ‘ఆరోగ్యం అండ్ పరిశుభ్రత–స్మోక్ అబ్జార్బర్స్’ అనే అంశంపై కెల్ల జెడ్పీహెచ్‌ఎస్, ‘వాటర్ లీకేజ్ అండ్ డ్రైయిన్ ఓవర్‌ఫ్లో డిటెక్షన్ సిస్టమ్’ అనే అంశంలో కొండవెలగాడ జెడ్పీహెచ్‌ఎస్ ప్రాజెక్టులు విజేతలుగా నిలిచాయి. ఉపాధ్యాయుల కేటగిరిలో రామతీర్థం జెడ్పీహెచ్‌ఎస్ టీచర్ బల్లా శ్రీనివాసరావు (నీటి పొదుపు, పరిశుభ్రతకు పర్యావరణ హిత స్థూపాకార యూరినల్ బ్లాక్ డిజైన్), కొట్టాం జెడ్పీహెచ్‌ఎస్ టీచర్ పి.స్వప్న (స్కూల్ గ్రీన్ ల్యాబ్) విజేతలుగా ఎంపికయ్యారు. విద్యార్థుల వ్యక్తిగత కేటగిరి విజేతలుగా వియ్యంపేట కొత్తవలస ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (బాలికలు) విద్యార్థులు రూపొందించిన ‘ఎఫిషియంట్ ట్రైన్ ప్లాట్ ఫాం క్రాసింగ్ సిస్టం’ ప్రదర్శన, దేవుపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు రూపొందించిన వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు’ ఎంపికయ్యాయి. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు చేతుల మీదుగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓలు విజేతలైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విజేతలు
జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ టి.రాజేష్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విజేతలుగా ఎంపికై న గ్రూప్ కేటగిరిలో ఏడు ప్రాజెక్టులు, టీచర్ కేటగిరిలో రెండు ప్రాజెక్టులు, వ్యక్తిగత విద్యార్థి కేటగిరిలో రెండు ప్రాజెక్టులు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి విజేతలు ఆ తరువాత జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం


