నేర పరిశోధనలో రాష్ట్రస్థాయి అవార్డు
పార్వతీపురం రూరల్: నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. దర్యాప్తులో చాకచక్యం ప్రదర్శించిన కేసులకు ఇచ్చే ‘ఏబీసీడీ’ అవార్డుల్లో జిల్లా పోలీసు శాఖ రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, గత ఏఎస్పీ అంకిత సురానా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సాలూరు మండలం చీపురువలస సమీపంలోని ఒక జీడితోటలో యువతి మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును, ఎస్పీ ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలతో విశ్లేషించారు. కాల్‌డేటా, సీసీటీవీ ఫుటేజీ. సెల్ టవర్ లొకేషన్ సాయంతో అది ’హత్య’ అని తేల్చడమే కాకుండా, కేవలం 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఈ దర్యాప్తు అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ, ఎస్సైలు నరసింహమూర్తి, వెంకట సురేష్, రమణ, క్లూస్ టీం సభ్యులను డీజీపీ అభినందించారు.


