పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన వినతులు
● త్వరితగతిన పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
● 273 అర్జీల స్వీకరణ
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ సంఖ్యలో అర్జీలు పోటెత్తాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 273 వినతులు స్వీకరించగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 120, డీఆర్‌డీఏకు 45, జిల్లా పంచాయతీ రాజ్‌కు 13, వైద్యశాఖకు 15, మున్సిపల్, విద్యుత్ శాఖలకు 10, గ్రామసచివాలయాలకు సంబంధించి 7, హౌసింగ్‌కు 4, ఇతర శాఖలకు 43, డీసీహెచ్‌ఎస్ శాఖకు రెండు అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై ఎండార్స్‌మెంట్ చేసే ముందు అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే పీజీఆర్‌ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100కు అందే కాల్స్‌కు కూడా సత్వరం సరైన సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. వినతుల స్వీకరణలో కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను విని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో సర్వే ఎ.డి ఆర్. విజయకుమార్, కలెక్ట్‌రేట్ ఏవో దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ అన్నపూర్ణమ్మ, బీసీ సంక్షేమ అధికారి జ్యోతిశ్రీ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, మార్క్‌ఫెడ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదు దారులపై పోలీస్ సిబ్బంది అసహనం
విజయనగరం క్రైమ్: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ దామోదర్ తన చాంబర్‌లోను, ఏఎస్పీ సౌమ్యలత కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌లో 40 మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలను చెప్పుకోగా, సిబ్బంది మాత్రం ఫిర్యాదుదారులపై అసహనం వ్యక్తం చేశారు. ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదు దారుల సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి వారి సమస్యలపై వారిముందే సంబంధిత స్టేషన హౌస్ ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడారు.అనంతరం ఫిర్యాదు దారుల సమస్యలను డేటాలో నిక్షిప్తం చేసే క్రమంలో సిబ్బంది వారిపై అసహనం ప్రదర్శించారు. పనిలో వస్తున్న ఒత్తిడిని, ఫిర్యాదు దారులపై అసహనం రూపంలో వ్యక్తం చేశారు. సమస్యతో రోడ్డుక్కినప్పుడు లేని సిగ్గు, ఆందోళన, భయం..స్టేషన్ కు వెళ్లమంటే ఏమొచ్చిందంటూ ఓ పెద్దాయనతో డీపీఓలో సిస్టం ముందు కూర్చుని అంశాలను కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్న ఓ కానిస్టేబుల్ అసహనం వ్యక్తం చేశాడు. వచ్చిన ఫిర్యాదులను ఎస్‌హెచ్‌ఓలు క్షుణ్ణంగా పరిశీలించాలని వాటిని ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఎస్పీ దామోదర్ అదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సిబ్బందిని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ కె. కుమార స్వామి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, అంబేడ్కర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన వినతులు


