అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 82 వినతులు అందజేశారు. వినతుల్లో రెవెన్యూకు సంబంధించి 12, సాధారణ అర్జీలు 70 ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో డీఆర్‌ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీసులు, ప్రజల మధ్య పరస్పర
విశ్వాసం బలోపేతం చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారుల నుంచి స్వీకరించిన సమస్యలను వీలున్నంత మేరకు పరిష్కరించి పోలీసుశాఖ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీపత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఎస్పీ ఫోన్‌లో మాట్లాడి వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలైనట్‌లైతే చట్టపరిధిలో చర్యలు చేపట్టి తీసుకున్న చర్యల నివేదికను తన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. మొత్తంగా 9 ఫిర్యాదులు ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు అందాయి. కార్యక్రమంలో ఎస్పీతోపాటు జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీసీఐ ఆదాం, ఎస్సై రమేష్‌నాయుడు మరికొందరు సిబ్బంది ఉన్నారు.
డీకేటీ భూములకు అందని అన్నదాత సుఖీభవ
సీతంపేట: డీకేటీ, ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములు సాగుచేస్తున్న గిరిజన రైతులకు అన్నదాత సుఖీబవ నిధులు బ్యాంకు ఖాతాలో జమకాలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్.మోహన్‌రావు, వి.చలపతి, అప్పారావు, మంగయ్య, వెంకునాయుడు తదితరులు ఐటీడీఏలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసాలో అందరికీ నిధులు వచ్చాయని, ఇప్పుడు పూర్తిగా అందలేదన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇతర వినతులు పరిశీలిస్తే ఓండ్రుజోలకు చెందిన అంగన్‌వాడీ ఆయా సునోమి 19నెలల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరింది. ఐటీఐ ఎదురుగా ఇళ్ల నిర్మాణం చేసుకున్న గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు వినతిపత్రం ఇచ్చారు. కిరాణాషాపు పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని శిలిగాంకు చెందిన సవర అప్పలమ్మ కోరింది. చింతలగూడకు చెందిన వి.సొంబరు ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములను సర్వే చేసి పట్టాలిప్పించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీఈవో రామ్మోహన్‌రావు, వ్యవసాయాధికారి వాహినిణి, ఏపీడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి


