ఏపీ టెట్‌పై యూటీఎఫ్ నిరసన
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ జిల్లా కమిటీ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండురోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో తొలిరోజున జిల్లా వ్యాప్తంగా తాలూకా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రెండోరోజు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2010కి ముందు నియమితమైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మనహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెట్ అర్హతపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు మినహాయించి రీ షెడ్యూల్ చేయాలని కోరారు. బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జేఏవీఏఆర్‌కే ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో యూటీఫ్ నాయకులు సీహెచ్ తిరుపతినాయుడు, జి.రాజారావు, శ్రీదేవి, అల్లు శంకరరావు, గంగాధర్, ఎస్.వెంకటరావు, పల్లి శ్రీనివాసరావు, సుశీల తదితరులు పాల్గొన్నారు.


