రెవెన్యూ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 29 నుంచి నేటి వరకు తొమ్మిది రెవిన్యూ క్లినిక్‌లను నిర్వహించామన్నారు. జేసీ ఆద్వర్యంలో తహసీల్దార్లందరూ రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారానికి కృషిచేస్తున్నారని చెప్పారు. దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జేసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లను ఓ రోజంతా ఒకే చోట ఉంచడమే రెవెన్యూ క్లినిక్ ప్రధాన ఉద్దేశమన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్, సిర్టిఫికెట్లు, సర్వీస్ రిక్వెస్ట్ రేజింగ్‌లో ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ వంటివి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జేసీ స్థాయి అధికారి ప్రతి పిటిషన్‌ను ఆడిట్ చేస్తారన్నారు. తొమ్మిది వారాలకు గాను ఆరు వారాల్లో వచ్చిన 227 ఫిర్యాదులను పరిష్కరించినట్టు వెల్లడించారు. మిగిలిన వూడు వారాల్లో వచ్చిన సమస్యలు పరిశీలనలో ఉన్నాయన్నారు. జేసీ సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది అంతా ఒకే వేదికవద్ద పాల్గొని సమస్యలు పరిష్కారానికి చొరవ చూపడంతో సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమం అయ్యిందన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.


