అదనపు ధాన్యం దోపిడీపై.. రైతన్న తిరుగుబాటు
పాలకొండ: చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలు కర్షకులను ఆందోళనకు, అవస్థలకు గురిచేస్తున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ధర్నాలు చేస్తున్నారు. వ్యాపారులు, మిల్లర్ల దోపిడీపై పోరుబాటు సాగిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతు చేతికొచ్చిన ధాన్యం కోనుగోలు చేయాలంటే 80 కేజీల బస్తాకు మరో నాలుగు కేజీలు అదనంగా ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా రైతులు తీసుకెళ్లిన ధాన్యం మిల్లుల వద్ద దింపేందుకు ఇబ్బందులు పెడుతుండడంతో చేసేది లేక మంగళవారం ఆందోళనకు దిగారు. పాలకొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు.. మిలర్ల తీరుకు నిరసనగా రోడ్డెక్కారు. ముందుగా తహసీల్దార్ కార్యలయం వద్ద ధర్నా చేశారు. అక్కడ నుంచి నేరుగా పాలకొండ పట్టణంలోని రైస్ మిల్లుకు ధాన్యంతో ఉన్న ట్రాక్టర్లతో చేరుకున్నారు. అక్కడ రైసు మిల్లు యజమానితో వాగ్వాదానికి దిగారు. అదనంగా నాలుగు కేజీలు ధాన్యం ఇస్తేనే కొనుగోలు చేస్తామని మిలర్లు పట్టుబట్టారు. అక్కడికి పట్టణంలోని రైసు మిలర్లు అందరూ చేరుకుని రైతులతో ఎదురుదాడికి దిగారు.ఈ ఘటనతో రైతులు కలత చెందారు. వ్యవసాయశాఖ ఏఓను నిలదీశారు. అదనంగా ధాన్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. రైతన్నను కన్నీరుపెట్టించే ప్రభుత్వం కూలిపోక తప్పదంటూ శాపనార్థాలు పెట్టారు. రైతు వ్యతిరేక విధానాలపై నినదించారు. ట్రైనీ ఎస్‌ఐ హేమలత, వ్యవసాయశాఖ ఏఓ, సీఎస్‌టీడీ సన్యాసిరావు రైతులు, మిలర్లకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అప్పటికీ రైతులు శాంతించక ధాన్యం బస్తాలను ప్రధాన రహదారిపై పారబోసేందుకు వాహనాలను తరలించారు. రోడ్డు మధ్యలో బస్తాలను పడేసేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్‌ను రోడ్డుపైకి తీసుకెళ్లిన సమయంలో ట్రైనీ ఎస్సై హేమలత అడ్డుకున్నారు. మిల్లర్లతో మాట్లాడుతానని చెప్పి రైతులను ఒప్పించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక మిల్లర్లు 80 కేజీల లెక్కనే ధాన్యం తీసుకునేందుకు అంగీకరించారు. రైతులు ఆందోళన విరమించి ధాన్యం మిల్లులకు అప్పగించారు.
పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
రైస్ మిల్లు వద్ద ఆందోళన
రహదారిపై ధాన్యం పారబోసే ప్రయత్నం
అడ్డుకుని సర్దిచెప్పిన పోలీసులు
అదనపు ధాన్యం దోపిడీపై.. రైతన్న తిరుగుబాటు
అదనపు ధాన్యం దోపిడీపై.. రైతన్న తిరుగుబాటు


