లారీ యజమానుల వర్రీ..!
సాలూరు: విజయవాడ తరువాత సాలూరులోనే లారీ పరిశ్రమ పెద్దది. సుమారు 2 వేలకు పైగా లారీలు సాలూరులో ఉన్నాయి. ఈ లారీపరిశ్రమ ఆధారంగా సాలూరు, పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్‌ను అమలుచేస్తూ రాష్ట్రంలో లారీలకు సంబంధించి టెస్టింగ్ ఫీజులు, సర్టిఫికేషన్ ఫీజులు భారీగా పెంచి వసూలు చేయడం లారీ పరిశ్రమకు తీరని దెబ్బగా మారింది.ఇప్పటికే అన్ సీజన్ కావడంతో ట్రిప్పులు లేక లారీ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. ఇటువంటి సమయంలో పక్క రాష్ట్రాల్లో అమలుచేయకపోయినా, మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అమలుచేసి తద్వారా టెస్టింగ్ ఫీజులు సర్టిఫికేషన్ ఫీజులు భారీగా పెంచి వసూలు చేయడం ప్రారంభించారు, ప్రస్తుతం హెవీ వాహనాలకు వసూలు చేస్తున్న రూ.1.340 ఫిట్‌నెస్ ఫీజును 20 సంవత్సరాలు దాటిన వాహనాలకు రూ.33,040లకు పెంచి వసూలు చేస్తున్నారు. అంతేకాక 13 సంవత్సరాలు దాటిన వాహనాలపై కూడా గణనీయమైన పెరుగుదల విధించారు. ఈ నిర్ణయం లారీ పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తోంది.
పాత వాహనాలే అధికం
నూతన లారీల ధరలు అధికం కావడంతో, సాధారణంగా చాలావరకు పాత వాహనాలను వీలైనంత వరకు కొనుగోలు చేసి స్థానిక ప్రాంతాల్లో స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వే గూడ్స్ షెడ్‌ల నుంచి షిప్పింగ్ యార్డుల నుంచి గోదాములకు సరుకుల రవాణా కోసం లారీలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోనూ 15 సంవత్సరాలు దాటిన వాహనాల శాతం చాలా తక్కువ. పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో సుమారు 3500 రైల్వే,షిప్‌యార్డు గూడ్స్ రవాణా చేసే లారీలు ఉన్నాయి.
ఉపాధికోల్పోయే ప్రమాదం
పెంచిన ఽఫీజులకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ యథాతథంగా అమలుచేస్తే పాత లారీ యజమానులు అందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.
టెస్టింగ్ ఫీజులు, సర్టిఫికేషన్ ఫీజులు భారీగా పెంపునకు సంబంధించి కేంద్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మిగిలిన చాలా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. మరి మన రాష్ట్రంలోనే ఎందుకు అమలుచేస్తున్నారు. దీని అమలు వల్ల లారీ పరిశ్రమ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. మనకు చాలా వరకు పాతలారీలే అధికంగా ఉన్నాయి. పార్వతీపురం,విజయనగరం జిల్లాల్లో సుమారు 3500 రైల్వే,షిప్‌యార్డు గూడ్స్ రవాణా చేసే లారీలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ చార్జీలను తగ్గించాలని కోరుకుంటున్నాం.
గొర్లె మధుసూదనరావు, స్టేట్ లారీ జోనల్ అసోసియేషన్ సెక్రటరీ, సాలూరు
రాష్ట్ర ప్రభుత్వం పాత టెస్టింగ్ ఫీజులు, సర్టిఫికేషన్ ఫీజులను కొనసాగించి స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న వాహనయజమానులకు అండగా నిలవాలని లారీ యజమానులు కోరుకుంటున్నారు. అలాకాకుండా ఈ పెంచిన ఫీజులను వసూలు చేసినట్లయితే ,మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ఉన్న రైల్వే గూడ్స్‌షెడ్స్, షిప్‌యార్డుల్లో గూడ్స్ రవాణా నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు.
టెస్టింగ్ ఫీజులు, సర్టిఫికేషన్ ఫీజులు భారీగా పెంపు
ఫీజుల పెంపు వల్ల పరిశ్రమపై తీవ్రభారం
నేటి అర్ధరాత్రి నుంచి లారీల్లో రైల్వే, షిప్‌యార్డు గూడ్స్ రవాణా నిలుపుదల
పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో సుమారు 3500 రైల్వే, షిప్‌యార్డు గూడ్స్ రవాణా చేసే లారీలు
లారీ యజమానుల వర్రీ..!


