మత్తుపై సమర భేరి
● జిల్లా కేంద్రంలో అభ్యుదయ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం
● 3వేల మందితో భారీ మానవహారం
పార్వతీపురం రూరల్: మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మార్గదర్వకత్వంలో పాయకరావుపేటనుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర సోమవారం జిల్లా కేంద్రంలో అడుగుపెట్టగా అపూర్వ స్పందన లభించింది. మరిపివలస నుంచి మొదలైన ఈయాత్ర జిల్లా కేంద్రంలోని చర్చి జంక్షన్‌కు చేరుకోగానే పండగ వాతావరణంలో కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి, జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనిషా రెడ్డిలు యాత్రకు ఘన స్వాగతం పలికారు. డప్పులు, తప్పెటగుళ్లు, కోలాటాల నడుమ అధికారులే స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొనడం యువతలో నూతనూత్తేజం నింపింది. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌వద్ద 3వేలమంది విద్యార్థులు, ప్రజలతో భారీ మానవహారంగా రూపొంది డ్రగ్స్ వద్దుబ్రో అంటూ ముక్తకంఠంతో నినదించారు.
సరదాకోసం చేస్తే జీవితం బలి
స్థానిక కన్యకాపరమేశ్వరి కల్యాణ మంటపంలో జరిగిన సభలో ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ యువతను పక్కదోవ పట్టించేందుకు కొందరు చాక్లెట్ల రూపంలో మత్తును చిమ్ముతున్నారని ఆకర్షణీయమైన మాటలతో వలవేసే వారిని నమ్మొద్దని , గంజాయి మహ్మరి మొదడును మొద్దుబార్చి, భవిష్యత్‌ను అంధకారం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లానే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు డీఐజీ గోపీనాఽథ్ జెట్టి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.


