మంత్రి కుమారుడిపై కేసు నమోదుకు డిమాండ్
● ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన పీఏను అరెస్టు చేయాలి
● రౌండ్‌టేబుల్ సమావేశంలో మహిళా సంఘాల డిమాండ్
పార్వతీపురం రూరల్: మహిళలకు రక్షణ కల్పించాల్సిన సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగినికి రక్షణ కరువవడం సిగ్గుచేటని, వేధింపులకు పాల్పడిన మంత్రి కుమారుడిపై తక్షణమే కేసు నమోదుచేయాలని, అనధికారిక పీఏను అరెస్టు చేయాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్.శ్రీదేవి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మహిళా సంఘాల నాయకులు మాట్లాడారు. సాలూరుకు చెందిన మహిళా ఉద్యోగినిని మంత్రి పీఏ, కుమారుడు శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మంత్రి కుమారుడిపై కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పీఏపై కేసు ఉన్నప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన అధికారులు ఆమెకు నిబంధనల ప్రకారం రావాల్సిన సెలవులు నిరాకరిస్తూ జీతాల్లో కోత విధిస్తూ వేధించడం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐద్వా, ప్రగతిశీల మహిళా సంఘం, శ్రామిక మహిళా సంఘం నాయకులు బి.లక్ష్మి, పి.రమణి, వి.ఇందిర, తులసి, కుమారి, తదితరులు పాల్గొన్నారు.


