రాజకీయ కక్షతో వేధింపులు
పార్వతీపురం రూరల్: రాజకీయ కక్ష సాధింపులు హద్దులు దాటాయి. పార్టీ మారలేదన్న అక్కసుతో ఏకంగా ఒక వ్యక్తి గౌరవమర్యాదలను బజారుకీడ్చేలా అత్యంత జుగుప్పాకరమైన రాతలతో సోషల్ మీడియాలో దాడికి తెగబడ్డారు. సాలూరు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో అధికార పార్టీ అండ చూసుకొని ఓ మంత్రి డ్రైవర్ బరితెగించడాన్ని, తన వ్యక్తిగత జీవితంపై నీచమైన ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని బాధితుడు, మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ అధికార్ల నాగ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసి రోజుల గడుస్తున్నా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని, అందుకే జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్టు తెలిపారు. గతంలో టీడీపీలో ఉన్న తను వైఎస్సార్‌సీపీలో చేరానని, ప్రస్తుతం మంత్రి గుమ్మడి సంధ్యారాణి వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న రౌతు హరికుమార్ అనే వ్యక్తి తిరిగి టీడీపీలో చేరాలంటూ పలుమార్లు ఒత్తిడి తెచ్చారన్నారు. దీనికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని వాపోయాడు. అన్ని ఆధారాలతో హరికుమార్‌పై ఈ నెల 3న సాలూరు టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో ఎస్పీ మాధవ్‌రెడ్డికి గోడువినిపించినట్టు తెలిపారు. ఫిర్యాదు కాపీ, మంత్రి డ్రైవర్ సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకర పోస్టులను విలేకరులకు చూపించారు.
పార్టీ మారలేదని మంత్రి డ్రైవర్ పైశాచికం
వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల పోస్టులతో ప్రచారం
ఫిర్యాదు చేసి 4 రోజులైనా స్పందించని పోలీసులు
ఎస్పీకి మొరపెట్టుకున్న మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ నాగరాజు


