‘ముస్తాబు’తో ఆరోగ్య సంరక్షణ
● రాష్ట్రానికి రోల్ మోడల్‌గా మన్యం
పార్వతీపురం: పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ ‘ముస్తాబు’తోనే సాధ్యమని భావించిన కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పాఠశాలల్లో చిత్తశుద్ధితో అమలుచేయాలని దిశానిర్దేశం చేశారు. పలు పాఠశాలలకు వెళ్లి స్వయంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముస్తాబు కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. అమలుపై ఉపాధ్యాయులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీలకు దిశా నిర్దేశం చేశారు. ‘విద్యార్థి ఆరోగ్యమే భవిష్యత్ రాష్ట్రానికి పునాది’ అనే సంకల్పంతో జిల్లాలో కలెక్టర్ ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమానికి అనతికాలంలోనే పాఠశాల స్థాయికి చేరింది. జిల్లాలోని 1272 పాఠశాలల్లో చదువుతున్న సుమారు 89వేల మంది విద్యార్థులు ప్రతిరోజు ‘ముస్తాబు’ అవుతున్నారు. దీనికి రాష్ట్రస్థాయిలో పేరొచ్చింది. ఇటీవల భామినిలో పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సమష్టి కృషితో జిల్లాలో ముస్తాబు కార్యక్రమం విజయవంతమైంది. ప్రతీగ్రామానికి, పాఠశాలకు కార్యక్రమం చేరింది. పిల్లల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలో వైద్య పర్యవేక్షణను నిరంతరం కొనసాగిస్తాం. పార్వతీపురం మన్యం జిల్లాను ఆరోగ్యహమీ నిలిపే లక్ష్యంతో పనిచేస్తాం.
– డా.ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా.


