మీ కోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపి.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 నంబరుకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.
బట్లబద్ర పంట పొలాల్లో గజరాజులు
జియ్యమ్మవలస: మండలంలోని బట్లబద్ర, బిత్రపాడు పంట పొలాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి. ఆదివారం ఉదయం వెంకటరాజపురం అరటి తోటలో ఉన్న గజరాజులు మధ్యాహ్నం గుమ్మిడివాగులోకి జారుకున్నాయి. సాయంత్రానికి బట్లబద్ర పామాయిల్ తోటలోకి చేరుకున్నాయి. అరటి, పామాయిల్, వరి పొలాల్లో ఉంటూ పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాటిని తరలించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
వేతన వివక్ష తగదు
● జీతాలు ఇవ్వండి.. లేదంటే ఆందోళనే..: యూటీఎఫ్
పార్వతీపురం రూరల్: అందరికీ ఒక న్యాయం, గిరిజన సంక్షేమ టీచర్లకు మరొక న్యాయమా? అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నవంబరు నెల గడచినా.. డిసెంబర్ 8 దాటిన గిరిజన సంక్షేమ టీచర్లకు జీతాలు అందలేదని, ఇతర యాజమాన్యాలకు జీతాలు చెల్లించి తమపై వివక్ష చూపడం అన్యాయమని ఆయనన్నారు. ఈ కారణంగా ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీతాలు చెల్లించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామివారి దేవస్థానం శ్రీరామనామ సంకీర్తనతో ఆదివారం మార్మోగింది. స్వామి సన్నిధిలో పలువురు భక్తులు సహస్ర శ్లోకీ రామాయణ పారాయణం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరాకాండ హోమాన్ని జరిపించారు. ఉత్సవమూర్తుల వద్ద స్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించిన అనంతరం భగవత్ రామానుజ దాస బృందానికి చెందిన భక్తులు సహస్ర శ్లోకి రామాయణం 72వ ఆవృతం, శ్రీమన్నారాయణ వైభవం 70వ ఆవృతం పారాయణం చేశారు. ఈ సందర్భంగా బృంద సభ్యుడు శ్రీమాన్ కందాల రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు సింహాచలం, శ్రీకూర్మం, పద్మనాభం, తదితర దివ్య క్షేత్రాల్లో పారాయాణాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: హిందీ భాషాభిమానుల వేదికగా పేరొందిన హిందీ మంచ్ జిల్లా శాఖ కొత్త కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక పూల్‌బాగ్‌లోని సరస్వతి శిశుమందిర్‌లో జరిగిన ఎన్నికల సభలో జిల్లా అధ్యక్షులుగా ఏలూరు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా నందివాడ చిన్నాదేవి, గౌరవాధ్యక్షురాలుగా పి.ఉమాబాల, సహాధ్యక్షురాలుగా భోగరాజు సూర్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్ర కార్యదర్శి కోనే శ్రీధర్ ఎన్నికల సమన్వయకర్త గా వ్యవహరించారు. సంఘం కార్యదర్శిగా కె.రోజా, కె.శారదా పద్మావతి, ఉపాధ్యక్షులుగా ఆశాపు చంద్రారావు, విజయలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా సాలూరు సంతోషి, వై.సూర్యకుమారి, శ్రీదేవి ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా కె.సుబ్బారావు, గౌరవ సలహాదారుగా దవళ సర్వేశ్వరరావును ఎంపిక చేశారు.


