సక్రమంగా ధాన్యం కొనుగోలు : సబ్ కలెక్టర్
పాలకొండ: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. మండలంలోని తుమరాడ రైస్‌మిల్లును ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ రికార్డులు పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదని పేర్కొన్నారు. అదనంగా ధాన్యం తూకం వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం అన్‌లోడింగ్ చేయడం కోసం డబ్బులు వసూలు చేయొద్దని ఆదేశించారు. తేమ శాతం పరిశీలించిన తరువాతే ఆర్‌ఎస్‌కేల నుంచి ధాన్యం తరలించడం జరుగుతుందన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట సీఎస్‌డీటీ సన్యాసిరావు ఉన్నారు.


