‘కొటియా’ ప్రజల పయనమెటు!
వినతిచ్చినా.. వినడం లేదా...?
● పట్టుచెన్నేరులో నేడు సమావేశం
సాలూరు: వివాదస్పద ఆంధ్రా – ఒడిశా సరిహద్దు కొటియా గ్రూపు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు సడలిపోతుందా అంటే అవుననే జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొటియా గ్రూపు గ్రామాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య నలుగుతూనే ఉంది. న్యాయస్థానంలో స్టేటస్ కో అమల్లో ఉన్న నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించి పట్టు పెంచింది. ఒడిశా అధికారులు కవ్వింపు చర్యలకు పాల్పడినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తనదైన శైలిలో స్పందించి ఒడిశా అధికారుల ఆగడాలను పూర్తి స్థాయిలో నిలువరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒడిశా అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. ఏపీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకున్నారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం కొటియా గ్రామ పంచాయతీ వద్ద వెల్‌కమ్ అని ఒడియా.. ఇంగ్లిష్ భాషలో బోర్డును పట్టుచెన్నేరులో ఏర్పాటు చేసింది. కొటియాలో ఒడిశా ప్రభుత్వ పోలీస్‌స్టేషన్ ఉండగా, పట్టుచెన్నేరులో మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతుందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఒడిశా ప్రభుత్వ తీరుపై అక్కడి గిరిజనుల మండిపడుతున్నారు. దీనిపై పట్టుచెన్నేరు, పగులుచిన్నేరు, సొల్పగూడ, కోనదొర, ఎగువమెండంగి గ్రామాల ప్రజలు ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. మిగిలిన ఏడు గ్రామాల ప్రజలతో కలిసి సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఒడిశా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు, పింఛన్లు తీసుకోరాదని తదితర వాటిపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రా పోలీసుల సహకారం కోసం ఈ ప్రాంత గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తామంతా ఆంధ్రా వైపు ఉండాలనుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు ఉండడం లేదని దీంతో ఒడిశా ప్రభుత్వ చర్యలు, పోలీసులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఏం చేస్తున్నారు..
రెండు శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఈ గ్రామాల వివాదాన్ని పరిష్కరించడంలో మంత్రి వ్యవహర శైలి చర్చనీయాంశమైంది. ఇక్కడ బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం, ఒడిశాలో బీజీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో కచ్చితంగా ఈ కొటియా గ్రామాల సమస్య పరిష్కారమవుతుందని భావించిన ఈ ప్రాంత ప్రజలు ఒడిశా ప్రభుత్వ దూకుడును చూసి విస్తుపోతున్నారు.
ఈ గ్రామాల సమస్య పరిష్కరించాలని ఇటీవల మంత్రి సంధ్యారాణి ఒడిశా ముఖ్యమంత్రిని కోరి వినతిపత్రం ఇచ్చినట్టు పలు వార్తలు వచ్చాయి. అయితే ఇదే సమయంలో ఓ వైపు వినతులు తీసుకున్న ఒడిశా ప్రభుత్వం, ఈ కొటియా గ్రామాల్లో తన కార్యకలాపాలు మరింత ముమ్మరం చేసింది. ఇటీవల ఒడిశా బ్లాక్ అధికారులతో కూడిన యంత్రాంగం కొటియా గ్రామాల్లో పర్యటించి అక్కడ ప్రజలతో సమావేశాలను ఏర్పాటు చేసింది. శాఖల వారిగా ఒడిశా అధికారులు గ్రామాల్లో తమ శాఖల ద్వారా జరుగుతున్న పనులపై అక్కడ గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఆంధ్రా అధికారులను ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. గతంలో కొటియాకే పరిమితమైన ఒడిశా అధికారులు దౌర్జన్యం క్రమేణా పట్టుచెన్నేరు, పగులుచిన్నేరు పంచాయతీలకు విస్తరిస్తుండడం గమనార్హం. విలువైన రంగురాళ్లు, ఐరన్ ఓర్, గ్రానైట్ తదితర వివిద ఖనిజ నిక్షేపాలు కొటియా గ్రూప్ గ్రామాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. తామంతా ఆంధ్రాలో ఉండాలని ఇక్కడ గ్రామాల్లో అధిక శాతం గిరిజనులు ఆసక్తి చూపుతున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
‘కొటియా’ ప్రజల పయనమెటు!


