ఇదేం తూకం.. : కలెక్టర్
బలిజిపేట: బలిజిపేటలోని జయలక్ష్మి మోడరన్ రైస్‌మిల్లును జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీచేసి అక్కడ ఉన్న ధాన్యం బస్తాను తూకం వేయించగా అదనపు ధాన్యం ఉండడంతో ఆగ్రహించారు. మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న 40 కిలోల ధాన్యం బస్తాను తీయించి తూకం వేయించగా 42.500 కిలోలు రావడంతో ఇదేంటి ఈ తూకం 40 కిలోలు మాత్రమే ఉండాలి కదా అదనంగా 2కిలోలకు పైగా ఉన్నాయేంటి.. ఎందుకు అలా తీసుకున్నారు, రైతులను ఎందుకు నష్టపెడుతున్నారని మిల్లరును ప్రశ్నించారు. అక్కడే ఉన్న మిల్లర్లు గన్నీకి కొంత పోతాయండి అంతే తప్పా అదనం ఏమిలేదని తెలిపారు. అక్కడే ఉన్న ఒక ట్రాక్టరు ట్రక్‌షీట్ తీసుకొని దానిని పరిశీలించగా 200 బస్తాలకు ఉంది. కాని దానిలో 150బస్తాలు ఉన్నట్టు గుర్తించి ఎందుకు ఈ విధంగా జరిగిందని ప్రశ్నించారు. రైతు దింపుడు కూలి కింద రూ.5లు అదనంగా వసూలు చేస్తున్నారని కలెక్టర్ దృష్టిలో పెట్టగా అలా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించగా అవి రైతు ఖాతాకు జమ అవుతాయని మిల్లర్లు తెలిపారు. ఏది ఏమైనా అదనంగా ధాన్యాలు తూకాలు వేసి రైతులను నష్టపెడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ ప్రభాకరరెడ్డి మిల్లర్లను హెచ్చరించారు. అదనపు ధాన్యాలు తూకాలు వేసి రైతులను నష్టపెట్టవద్దని సూచించారు. మిల్లుకు సంబంధించిన కాగితాలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ బాలమురళీ, అధికారులు, సిబ్బంది ఉన్నారు.


