కవి అంటే భ్రష్టయోగి
● పచ్చడం పుస్తకావిష్కరణలో వాగ్గేయకారుడు గోరటి వెంకన్న
రాజాం: కవి అంటే సాఫీగా జీవితాన్ని గడిపే వ్యక్తి కాదని, ఒక భ్రష్టయోగి అని వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఈ మేరకు ఆదివారం రాజాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాజాం రచయితల వేదిక నిర్వహించిన 11 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పచ్చడం పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. కవిలోపల భావాలెంతో గొప్పవని వెల్లడించారు. అతిశయాలు కవులకు శాపమని, పసితనమే కవులకు బలమని వివరించారు. ఈ సృష్టిలో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి వంటివి సౌందర్యవంతమైనవేనని, వాటిని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి స్వేచ్ఛగా ఆస్వాదించే అవకాశం లేకుండా రాజులు, భూ స్వాములు, పెత్తందారీలు, నిజాందారులు అణగదొక్కుతుంటే వాటి నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయగలిగేవే కవితలని పేర్కొన్నారు. జీవితం నుంచే కవిత్వం వస్తుంది. స్వప్నయోగంలో కవిత్వాలు పుడతాయి. ధూర్జటి, పోతన, కాళిదాసు వంటి కవులు మొదలుకుని ఈకవుల పరంపర కొనసాగుతోందని తెలిపారు. పరోపకారం కవి లక్షణమన్నారు. ఆకలి, దైన్యం, పేదరికం వంటివి చూసి, రాజులను ధిక్కరించేవి కవిత్వాలు. విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గురజాడ వంటివారందరూ పరోపకారానికి సంబంధించి కవితలు రాశారని వివరించారు. అటువంటి వారసత్వం నుంచి వచ్చినవారమే తామంతా అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ఎప్పటినుంచే కవులు రాజ్యధిక్కార కవితలు రాశారని గుర్తుచేశారు.
పోరాటాలు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర
పోరాటాలకు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర అని గోరటి వెంకన్న వెల్లడించారు. ఇక్కడ ఎన్నో పోరాటాలు కవుల నుంచి పుట్టుకొచ్చాయని, కవులు అంటే హాయిగా జీవితం గడిపేవారుకాదని పేర్కొన్నారు. క్షామంతో అల్లాడిపోతున్న పేదరికం కవి లక్షణమని, సంప్రదాయాన్ని, దైవత్వాన్ని ఎత్తుకుని ఆ పరంపరను కొనసాగించాలని, మానవత్వ విలువలు పెంచాలని, ఎప్పటికప్పుడు తనకు తాను కరిగిపోయి కవి నైతిక విలువలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. బుద్ధభగవానుడు పుట్టకుంటే దయ, జాలి వంటివి ఉండేవి కావేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి, రామలింగారెడ్డి, రంగమాచార్యులు, వేరుచూరి నారాయణరావు, పిల్లా తిరుపతిరావు, గార రంగనాథం వంటివారు తమ పద్ధతిలో తాము రచనలు చేస్తున్నారన్నారు. ప్రశంసలకు దూరంగా ఉన్నవారే మంచి కవిత్వాలు రాయగలరన్నారు. రాజాంలో రచయితల వేదిక 11 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం, 11 పుస్తకాలు ఆవిష్కరించడం చాలా ఆనందించదగిన విషయమన్నారు. రచయిత పిల్లా తిరుపతిరావు రచించిన పచ్చడం పుస్తకాన్ని రారవే నిర్వాహకులు సభలోని సభ్యులకు పరిచయం చేశారు. గోరటి వెంకన్న గొప్పతనాన్ని వివరించారు. పచ్చడం పుస్తకంలోని విశేషాలు వివరించారు. ఈ పుస్తకానికి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇన్‌చార్జ్ హెచ్‌ఎం బీవీ అచ్యుతరావు దంపతులు ఆర్థికసాయం అందించారని వెల్లడించారు. రచయిత తిరుపతిరావు తాను రచించిన పుస్తకంలోని సాహిత్య వ్యాసాలు వివరించారు.
పలువురికి సత్కారం
అనంతరం గోరటి వెంకన్నను రారవే సభ్యులు సత్కరించారు. పుస్తక రచయిత తిరుపతిరావును రారవే సభ్యులు, గోరటి వెంకన్న, స్నేహితులు, బంధువులు సత్కరించారు. పుస్తకావిష్కరణకు సహకరించిన అచ్యుతరావుతో పాటు ఆయన కుటుంబసభ్యులను రాజాం అమృత హాస్పిటల్ వైద్యురాలు సూర్యశైలజను అభినందించారు. అంతకుముందు సమతం మహేశ్వరరావు సమావేశాన్ని ప్రారంభించగా, డాక్టర్ ఆల్తి మోహనరావు, శ్రీనివాసరావు తదితరులు స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరానికి చెందిన రచయిత చీకటి దివాకర్, రాజాం రచయిత వెలుగు రామినాయుడు, మజ్జి మదన్‌మోహన్, రాజాం పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన రచయితలు, కవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


