వాటర్‌ఫాల్స్‌లో పడి యువకుడి మృతి
రామభద్రపురం: చేతికి అందివచ్చిన కొడుకు హఠాత్తుగా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఘోష అంతా ఇంత కాదు. కంటికీమింటికీ ఏకధారగా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. మండలకేంద్రానికి చెందిన యువకుడు ఆదివారం స్నేహితులతో కలిసి పిక్నిక్‌కు సాలూరు మండలంలోని కురికూటి వద్ద గల దళాయివలస వాటర్ ఫాల్స్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు లోయలో పడి మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలోని కోవెల వీధికి చెందిన గర్భాపు హరి బలరామకృష్ణ(26) కీర్తన గోల్డ్ లోన్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో పిక్నిక్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. స్నేహితులతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని దళాయివలస వాటర్ ఫాల్స్ దగ్గరకు పిక్నిక్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం సమయం వరకు సరదాగా గడిపాడు. మధ్యాహ్నం భోజన సమయంలో చేతులు కడుక్కుని వస్తానని స్నేహితులకు చెప్పి కింద లోయలోకి దిగాడు.ఇంతలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందకు పడిపోయాడు. ఎంతకీ రాకపోవడంతో స్నేహితులు వెళ్లి వెతకగా కనిపించలేదు. దీంతో దగ్గరలో ఉన్న గిరిజన వ్యక్తులను పిలిచి విషయం చెప్పారు. ఓ గిరిజన వ్యక్తి లోయలోని నీటిలోకి దిగి చూడగా హరి బలరామకృష్ణ నీటిలో దొరికాడు వెంటనే స్నేహితులు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబసభ్యులకు జరిగిన విషయంపై సమాచారం ఇచ్చారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రిలో మృతదేహాన్ని ఉంచారు.తండ్రి గోవిందరావు తాపీమేసీ్త్రగా పనిచేస్తుండగా తల్లి మగమ్మ గృహిణి.
వాటర్‌ఫాల్స్‌లో పడి యువకుడి మృతి


