సమస్య చెప్పుకుందామని వస్తే.. గెంటేశారు!
ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు చెప్పుకోవాలని వచ్చిన పలువురు ప్రజలకు నిరాశే ఎదురైంది. తమ నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు పట్టించుకోకవడం.. అధికారులు కూడా స్పందించకపోవడంతో నేరుగా సీఎంకే మొర పెట్టుకుందామని సుదూర ప్రాంతాల నుంచి పలువురు దివ్యాంగులు, వృద్ధులు, పిల్లల తల్లిదండ్రులు విచ్చేశారు. సీఎం దరిదాపులకు కూడా వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. హెలికాప్టర్ దిగి కాన్వాయ్లో ముఖ్యమంత్రి వెళ్తున్న సమయంలోనూ.. వీరి గోడు వినే పరిస్థితి లేకపోయింది.
●గుమ్మలక్ష్మీపురం మండలం పెదఖేర్జకు చెందిన నిమ్మల కళావతి దంపతులు.. నడవలేని స్థితిలో ఉన్న తమ ఎనిమిదేళ్ల కుమారుడు సంపత్‌ను తీసుకుని వచ్చా రు. 94 శాతం మానసిక దివ్యాంగత్వంతో బాధపడుతున్న తమ కుమారుడికి నేటికీ పింఛన్ రావడం లేదు. తమ ప్రాంత ఎమ్మెల్యేను, అధికారులను కలిసినా ప్రయోజనం లేదని నేరుగా ముఖ్యమంత్రి వద్దే మొర పెట్టుకుందా మని ఆశ పడ్డారు. ఎంత ప్రయత్నించినా సీఎంను కలిసే అవకాశం రాలేదు. చివరికి సీఎం కాన్వాయ్‌లో ఉన్న ఒకరికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు.
●భామిని మండలం కొసలి గ్రామానికి చెందిన గొర్లె తవిటమ్మ అనే దివ్యాంగురాలు.. తనకు వికలాంగ ధ్రువపత్రం ద్వారా రూ. 25 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పి మండపాటి నిర్మల, సుధీర్ అనే దంపతులు.. సుందరరావు అనే వ్యక్తి మధ్యవర్తిత్వంతో రూ. 6.15 లక్షలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రుణం లేదూ.. తన డబ్బులూ ఇవ్వడం లేదని వాపోయింది. ఎవరిని కలిసినా న్యాయం జరగడం లేదని.. సీఎం వద్దే తన గోడు చెప్పుకుందామని వచ్చింది. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది.
సమస్య చెప్పుకుందామని వస్తే.. గెంటేశారు!


