తాటిపూడి అందాలు అదరహో..!
● పర్యాటకులను ఆకర్షిస్తున్న బుచ్చి
అప్పారావుజలాశయం
● ప్రత్యేక ఆకర్షణగా కాటేజీ అందాలు
● కార్తీకమాసంలో పెరుగుతున్న పర్యాటకులు
గంట్యాడ: జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో తాటిపూడి ఒకటి. ఇక్కడ ఉన్న ఆహ్లాదకర అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో పర్యాటకులు వనభోజనాల (పిక్నిక్) కోసం వస్తారు. తాటిపూడిలో ఉన్న గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం అందాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. పచ్చని కొండ కోనల మధ్య జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం అందాలు పాపికొండలను తలపించేలా ఉన్నాయి. బోటుషికారు కూడా ఉండడంతో పర్యాటకులు ఆసక్తిగా వస్తున్నారు.
ముచ్చట గొల్పుతున్న కాటేజీ అందాలు
బుచ్చి అప్పారావు జలాశయం అవతల పర్యాటకులు విడిది చేసేందుకు కాటేజీ కూడా ఉంది. పర్యాటకులు ఉండేందుకు రూమ్‌లు కూడా అందంగా తీర్చిదిద్దారు. ఏసీ, నాన్ ఏసీ రూమ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కాటేజీ ప్రాంతాన్ని అందమైన పెయింటింగ్స్‌తో తీర్చిదిద్దడంతో ఆహ్లాదకరంగా అప్రాంతం ఉంది. దీంతో పర్యాటకులు కాటేజీని సందర్శించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ ఉన్న గిరివినాయక విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కాటేజీ ప్రాంతం అరకులో ఉండే అనుభూతిని కల్గిస్తోందని పర్యాటకులు ప్రశంసిస్తున్నారు.
అన్ని సౌకర్యాలు ఉన్నాయి
కార్తీక మాసంలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకుల కోసం కాటేజీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. ఏసీ, నాన్ ఏసీ రూమ్‌లు కూడా ఉన్నాయి. పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. భోజన వసతి కూడా ఉంది.
సీహెచ్.శేషు, కాటేజీ మేనేజర్
తాటిపూడి అందాలు అదరహో..!


