జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం
విజయనగరం: విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు, ప్రతిభ పాటవాలను మెరుగుపరిచేందుకు బాలలకు నాటిక పోటీలు దోహదపడతాయని హైకోర్టు న్యాయవాది, అంజని ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పువ్వల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఏర్పాటుచేసిన బాలల ఆహ్వాన నాటిక పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటిక పోటీలు నైతిక విలువలు పెంపొందించేందుకు సందేశాత్మకంగా రూపొందించినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గేట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ గురాన రాధిక అయ్యలు, ఖాదర్ బాబా దర్గా, దర్బార్ నిర్వాహకుడు, ఏటీకే వెలుగు ఓల్డేజ్ హోమ్ ప్రతినిధి మహమ్మద్ అహమ్మద్ బాబు, జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రా దేవి, కుసుమంచి సుబ్బారావులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వారిలో ఉన్న ప్రజ్ఞాపాటవాలు మిగిలిన వారికి పరిచయం చేసేందుకు, మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. నాటిక పోటీలకు సమన్వయకర్తగా ఈపు విజయ్ కుమార్ వ్యవహరించగా, న్యాయ నిర్ణేతలుగా పసుమర్తి సన్యాసిరావు, గెద్ద వరప్రసాద్, ఆదెయ్య మాస్టారు వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.స్వరూప, గిరిజా ప్రసన్న, డిమ్స్ రాజు, డీవీ సత్యనారాయణ ,గ్రంధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


