
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుక
పార్వతీపురం: విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమంలో విశ్వకర్మ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా విశ్వకర్మ పేరుగాంచారన్నారు. కృష్ణుడు పాలించిన ద్వారకానగరం వంటి పలు నగరాలు నిర్మించినట్లు పురాణాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు విశ్వకర్మలాంటి మహనీయుడిని స్మరించుకుని పూజించుకోవడం మన అదృష్టమన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అప్పన్న, విశ్వకర్మ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సృష్టికర్త, శిల్పకళా నిపుణుడు విశ్వకర్మ
విజయనగరం అర్బన్: నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సమాజంలో ఎల్లప్పుడూ విశేష గౌరవం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ పేర్కొన్నారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలలో పాల్గొన్న జేసి ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జె.జ్యోతిశ్రీ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, బీసీ సంక్షేమశాఖ అధికారులు, హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుక