
నదిలో మునిగిపోయి ఎద్దుల మృతి
సీతానగరం: నదిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతుకు జీవనాధారమైన రెండు ఎద్దులను ఆ నదే మృత్యువు ఒడిలోకి తీసుకు పోగా, అదృష్టవశాత్తు రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. మండలకేంద్రం సీతానగరంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సామంతల శ్రీనివాసరావు అనే రైతు స్థానిక శివాలయం దగ్గర సువర్ణముఖి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు ఆ రైతుకు ఎకరా విస్తీర్ణం లోపు వ్యవసాయపొలం ఉంది. వ్యవసాయ పనులు చూసుకుని విరామసమయంలో సువర్ణముఖి నదినుంచి ఇసుక తరలిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పటిలాగానే తన ఎద్దుల బండితో సువర్ణముఖి నదికి అవతల ఉన్న పొలంలో పని చేయడానికి వెళ్లాడు. అయితే ఇటీవల ఎగువ ప్రాంతాలకు వర్షాలు కురవడంతో నదిలో ఉండే పెద్ద పెద్దగోతులను గమనించే అవకాశం లేకపోయింది. దీంతో రెండు ఎద్దులతో పాటు నాటు బండి నది గోతిలో దిగి మునిగి పోవడంతో అప్రమత్తమైన రైతు శ్రీనివాసరావు బండి మీదనుంచి దిగి ముందుకు గెంతి ప్రాణాలను రక్షించుకున్నాడు. రైతు చూస్తుండగానే రూ.2 లక్షల విలువైన ఎద్దులు నదిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాయి. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే రైతు శ్రీనివాసరావును రక్షించి బయటకు తీసుకువచ్చారు. ట్రాక్టర్ తీసుకువచ్చి ఎద్దులను, టైరు బండిని బయటకు తీశారు. కుటుంబ పోషణాధారమైన ఎద్దులు కళ్లెదుటే కన్నుమూయడంతో శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రాణాలతో బయటపడిన రైతు

నదిలో మునిగిపోయి ఎద్దుల మృతి